ప్రభాస్.. పోటీ పడడం ఎవరి వల్ల కాదేమో!
ప్రభాస్.. ఇది పేరు కాదు బ్రాండ్ అనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
By: M Prashanth | 23 Oct 2025 3:41 PM ISTప్రభాస్.. ఇది పేరు కాదు బ్రాండ్ అనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అవ్వని వారు బహుశా ఉండరు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ డార్లింగ్ ను ఎప్పుడూ కొనియాడుతూనే ఉంటారు. ఎలాంటి మచ్చ లేకుండా కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.
సైలెంట్ గా తన పని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మాటలు తక్కువ.. పని ఎక్కువ చేస్తుంటారు. ప్రముఖ నటులు దివంగత కృష్ణంరాజు వారసుడిగా 23 ఏళ్ల క్రితం ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేయగా.. డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వర్షం మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఛత్రపతి మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. అప్పుడే టాప్ హీరోల లిస్ట్ లోకి వెళ్లిపోయిన ఆయన.. బాహుబలి-1తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ప్రభాస్.. ఆ లెవెల్ లోనే ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. బాహుబలి-2తో మరోసారి అదరగొట్టారు. అందనంత ఎత్తుకు వెళ్లారని చెప్పాలి.
అలా రెమ్యునరేషన్, మార్కెట్, ఫ్యాన్ బేస్ సహా అన్ని విషయాల్లో మిగతా హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే ప్రభాస్ బ్రాండ్ వాల్యూ కమ్ మార్కెట్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు లైనప్ లో ఐదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో రెండు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. మిగతావి మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కానున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో ఆయన ఇప్పుడు ఫౌజీ షూటింగ్ లోనూ డార్లింగ్ పాల్గొంటున్నారు. ఆ మూవీ కూడా వచ్చే ఏడాది థియేటర్స్ లో రిలీజ్ కానుంది. వాటితోపాటు స్పిరిట్, కల్కి-2, సలార్-2 వంటి బడా సినిమాలు ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి.
అయితే మొత్తంగా ఆ ఐదు ప్రాజెక్టుల విలువ 4000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. రూ.6 వేల కోట్ల మార్కెట్ చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఎందుకంటే ఇప్పటికే ఆయా ప్రాజెక్టులపై ఉన్న హైప్ చూస్తుంటే.. ప్రతి మూవీ దాదాపు 700 నుంచి 1000 కోట్ల రూపాయలను కచ్చితంగా వసూలు చేసే అవకాశం ఉంది. అదనంగా నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మార్కెట్ విషయంలో ప్రభాస్ తో పోటీ పడటం కష్టమే.
