రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!
'ఆదిపురుష్' సినిమాతో విమర్శలు ఎదుర్కొన్న ప్రభాస్‌కు మరో పౌరాణిక చిత్రంలో రావణుడి పాత్ర ఆఫర్ వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నితేశ్ తివారీ తెరకెక్కించిన రామాయణంలో తొలుత రావణుడి పాత్రకు ప్రభాస్‌ను అనుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యశ్ ఈ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ప్రభాస్ ఈ భారీ ప్రాజెక్టును అంగీకరించేవారా అనే చర్చ నడుస్తోంది.
By: Priya Chowdhary Nuthalapti | 8 Nov 2026 10:25 AM ISTఎలాంటి పాత్ర అయినా ప్రభాస్ అవలీలగా చేసేస్తారు. అలాంటి గొప్ప పేరు ఆయనకి ఉంది. కానీ అలాంటి ప్రభాస్ ఎన్నో విమర్శలు తెచ్చుకున్న సినిమా ఆది పురుష్. ఈ సినిమా విడుదలైనప్పుడు ఆయనకు ఎంతో నెగిటివిటీ వచ్చింది. అసలు రాముడిగా ఆయన సరిపోలేదని.. అసలు పౌరాణిక సినిమాలు ప్రభాస్ కి అస్సలు సెట్ అవ్వవు అని విమర్శలు తెచ్చుకున్నారు.
అలాంటి ఘోర అవమానం తరువాత.. ప్రభాస్ మరో పౌరాణిక సినిమాలో ఆఫర్ అందుకున్నారు అని ఏదైనా వార్త వస్తే అది తప్పకుండా ఆశ్చర్యపరచక మానదు.
అసలు విషయానికి వస్తే నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన రామాయణం పార్ట్ 1 నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా కనిపించగా.. కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్రలో నటించారు. సినిమా విడుదలైన తర్వాత ముఖ్యంగా రావణుడి పాత్ర గురించి సోషల్ మీడియాలో చాలానే ప్రశంసలు వచ్చాయి. కొంతమంది అయితే రాముడు, సీత పాత్రల కంటే రావణుడి పాత్ర విషయంలో దర్శకుడు మంచి నిర్ణయం తీసుకున్నారు అని కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. యశ్ లుక్, ఆయన నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రావణుడి పాత్రకు మొదట ప్రభాస్‌ను అనుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్త విన్న వాళ్లు అందరూ.. ఆశ్చర్యపోతున్నారు.
నిజానికి ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న హీరో. ఆయనతో సినిమా చేయాలంటే నిర్మాతలు పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభాస్ చేతిలో ఎన్నో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ప్రభాస్ ఆదిపురుష్ సినిమా విషయంలో ఎదుర్కొన్న అవమానాలు కారణంగా ఆయన మరో పౌరాణిక చిత్రం.. అది కూడా ఇంత బిజీగా ఉన్నప్పుడు ఒప్పుకుంటారు అనుకోవడం.. మన మూర్ఖత్వమే అవుతుంది అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
అంతేకాకుండా రామాయణం లాంటి భారీ చిత్రానికి చాలా ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. పైగా రామాయణం సినిమాని రెండు పార్ట్ లుగా దర్శకుడు అనుకున్న క్రమంలో ప్రభాస్ ఈ సినిమాకి చాలా టైం ఇవ్వాల్సి కూడా వచ్చుంటుంది.. కాబట్టి ఇవన్నీ గమనిస్తే.. ప్రభాస్ కి ఈ అవకాశం వచ్చిందా లేదా పక్కనపెడితే.. ఆయన తప్పకుండా ఈ సినిమా ఒప్పుకోకపోవడమే మంచి పని అని చాలామంది భావన.
