Begin typing your search above and press return to search.

అప్డేట్ లేకుండానే రికార్డు హైప్.. ఫౌజీ క్రేజ్ చూసి షాక్ అవుతున్న ఇండస్ట్రీ!

సినిమా విశేషాల విషయానికి వస్తే, సీతారామం వంటి క్లాసిక్ లవ్ డ్రామాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్‌ను ఎంచుకున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   8 Jun 2026 3:00 PM IST
అప్డేట్ లేకుండానే రికార్డు హైప్.. ఫౌజీ క్రేజ్ చూసి షాక్ అవుతున్న ఇండస్ట్రీ!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల‌తో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానుల దృష్టి మాత్రం ఒక్క సినిమాపైనే నిలిచిపోయింది. డైరెక్ట‌ర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీ గురించి అధికారికంగా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానుల్లో అసహనం పెరుగుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌లో కీలక భాగం పూర్తయిందని సమాచారం ఉన్నప్పటికీ, చిత్ర బృందం నుంచి రిలీజ్ డేట్ తో పాటు కనీస ప్రమోషనల్ కంటెంట్ కూడా బయటకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఎక్స్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ఫౌజీ అప్డేట్ ను వీలైనంత త్వ‌ర‌గా ఇవ్వాల‌ని కోరుతూ వివిధ హ్యాష్‌ట్యాగ్ ల‌ను ట్రెండ్ చేస్తున్నారు. సినిమా గురించి ఏదైనా అధికారిక సమాచారం ఇవ్వాలని, రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాల‌ని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దసరా సీజన్‌లో సినిమా రిలీజ‌వుతుంద‌నే ప్రచారం కొంతకాలంగా జరుగుతున్నా, దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు పండుగ సీజన్‌కు ఇప్పటికే పలు భారీ సినిమాలు క్యూ కడుతుండటంతో ఫౌజీ నిజంగా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న సందేహాలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ సైలెన్స్ వెనుక ఏదైనా స్పెష‌ల్ స్ట్రాట‌జీ ఉందా అనే చర్చ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది.

సినిమా విశేషాల విషయానికి వస్తే, సీతారామం వంటి క్లాసిక్ లవ్ డ్రామాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్‌ను ఎంచుకున్నారు. స్వాతంత్య్రానికి ముందు కాలాన్ని నేపథ్యంగా తీసుకుని, సైనికుడి పాత్రలో ప్రభాస్‌ను చూపించబోతున్నారని సమాచారం. రొమాంటిక్ ఎమోషన్స్‌ను అద్భుతంగా తెరకెక్కించే హను, ఈసారి దేశభక్తి, యుద్ధ నేపథ్యం, భావోద్వేగాలను కలగలిపి కొత్త తరహా సినిమాను అందించబోతున్నారనే అంచనాలున్నాయి. ఇదే కారణంగా ఫౌజీపై ప్రారంభం నుంచే భారీ ఆసక్తి నెలకొంది. ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

అయితే సినిమా నుంచి ఎలాంటి అఫీషియ‌ల్ అప్డేట్స్ లేక‌పోయినా ఫౌజీపై ఆస‌క్తి త‌గ్గ‌క‌పోగా, మరింత పెరుగుతుంది. ఒక్క పోస్టర్ లేదా గ్లింప్స్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనే స్థాయిలో అంచనాలున్నాయి. ప్రభాస్ అభిమానులు రోజురోజుకూ అప్డేట్ కోసం ఎదురుచూస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం తమ ప్రమోషనల్ వ్యూహాన్ని గోప్యంగానే ఉంచుతోంది. ఇదిలా ఉంటే కొంద‌రు మాత్రంసరైన సమయానికి భారీ స్థాయిలో ప్రమోషన్ ప్రారంభించేందుకు నిర్మాతలు ఎదురు చూస్తున్నార‌ని అంటున్నారు. అయితే మరోవైపు ఎక్కువకాలం సైలెన్స్ కొనసాగితే అభిమానుల అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా, ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధికంగా చర్చకు వస్తున్న సినిమాల్లో ఫౌజీ ఒకటిగా నిలవగా, అభిమానులు మాత్రం ఫౌజీ అప్డేట్ ఎప్పుడ‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం కోస‌మే ఎదురుచూస్తున్నారు.