Begin typing your search above and press return to search.

ఫౌజీ వర్సెస్ స్పిరిట్: ప్రభాస్ బ్యాలెన్సింగ్ తిప్పలు!

మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ న‌టిస్తోన్న పవర్ ఫుల్ కాప్ ఎంటర్‌టైనర్ `స్పిరిట్` చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది.

By:  Srikanth Kontham   |   5 Sept 2026 1:36 PM IST
ఫౌజీ వర్సెస్ స్పిరిట్: ప్రభాస్ బ్యాలెన్సింగ్ తిప్పలు!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతినిండా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వరుస సినిమాలగా ట్రాక్‌లోకి తెచ్చి అభిమానులను అలరిస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్లు, తిరుగులేని క్రేజ్, స్టార్ డైరెక్టర్ల కాంబినేషన్లు ఇలా ఒక‌టే హావుడి క‌నిపిస్తుంది. అయితే ఇదంగా నాణేనాకి ఒక‌వైపు మాత్ర‌మే మ‌రోవైపు చూస్తే డార్లింగ్ తీవ్ర‌మైన ఒత్తిడిలోనూ ఉన్న‌ట్లు తాజాగా వెలుగులోకి వ‌స్తోంది. షూటింగ్ షెడ్యూళ్లను బాలెన్స్ చేయడం ప్రభాస్‌కు పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం ప్ర‌భాస్ నటిస్తోన్న‌ రెండు పెద్ద ప్రాజెక్టులు `ఫౌజీ`,`స్పిరిట్` తేదీల సర్దుబాటు వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా `ఫౌజీ`పై నెట్టింట భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని నిర్మిస్తున్న భారీ విజువల్ వండర్‌లో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు సెప్టెంబర్ నెల నుంచే గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు.

మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ న‌టిస్తోన్న పవర్ ఫుల్ కాప్ ఎంటర్‌టైనర్ `స్పిరిట్` చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక ఘట్టాల షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. ఈ సినిమాను 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సందీప్ రెడ్డి వంగా పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. అనుకున్న సమయానికి సినిమా రావాలంటే ఏమాత్రం విరామం లేకుండా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది.

అయితే ఇక్కడే `ఫౌజీ`, `స్పిరిట్` చిత్రాల మధ్య డేట్స్ సర్దుబాటు చిక్కుముడిగా మారింది. డిసెంబర్‌లో విడుదల కానున్న `ఫౌజీ` చిత్రం కోసం ప్రభాస్ దేశవ్యాప్తంగా ప్రమోషన్లలో పాల్గొనాల్సి ఉంది. ప్రమోషన్ల కోసం ప్రభాస్ సమయం కేటాయించడం వల్ల నాన్‌స్టాప్‌గా జరగాల్సిన `స్పిరిట్` చిత్రీకరణకు కొంత ఆటంకం ఎదుర‌య్యే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ రెండు చిత్రాల విడుదల తేదీలు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. `ఫౌజీ` అనుకున్న సమయానికి డిసెంబర్ 3న థియేటర్లలోకి వస్తేనే? ప్రభాస్ దృష్టి పూర్తిగా `స్పిరిట్` పై పడుతుంది. తద్వారా మార్చి 5న `స్పిరిట్` గ్రాండ్ రిలీజ్‌కు మార్గం సుగమం అవుతుంది. ఈ రెండింటిలో ఏ ఒక్క సినిమా షెడ్యూల్ ఆలస్యమైనా? దాని ప్రభావం రెండో చిత్రం విడుదలపై పడటం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఒకే సమయంలో ఇద్దరు క్రేజీ దర్శకులతో కలిసి పనిచేస్తూ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న ప్రభాస్ బ్యాలెన్సింగ్ గేమ్‌ను ఎలా నెట్టుకొస్తారనేది ఆస‌క్తిక‌రం. ఎంతో సమయస్ఫూర్తితో ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేసుకునే డార్లింగ్ ప్రమోషన్లు, షూటింగ్ షెడ్యూళ్లను సునాయసంగా సర్దుబాటు చేసి రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మ‌రి అది జ‌రుగుతుందా? లేదా? అన్న‌ది చూడాలి.