ఫౌజీ ఆలస్యంపై పెదవి విప్పిన జితిన్ గులాటీ!
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రేజీ పీరియాడిక్ డ్రామా `ఫౌజీ` చిత్రం అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Srikanth Kontham | 3 Oct 2026 3:38 PM ISTరెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రేజీ పీరియాడిక్ డ్రామా `ఫౌజీ` చిత్రం అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా డిసెంబర్ 3న విడుదల కావాల్సి ఉండగా మేకర్స్ వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు జితిన్ గులాటీ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో విడుదల వాయిదా వెనుక అసలు కారణాలను వెల్లడించారు.
సినిమా ఆలస్యం కావడం చిత్ర బృందానికి ఎలాంటి షాక్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. `మేము ఇంకా సినిమా చిత్రీకరణలోనే ఉన్నాం. కాబట్టి విడుదల వాయిదా పడుతుందనే విషయం మాకు ముందే అర్థమైంది` అని ఆయన పేర్కొన్నారు. సగం పూర్తయిన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించకూడదనే ఉద్దేశంతోనే నిర్మాతలు, దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
సినిమా అనేది జీవితాంతం నిలిచిపోయే కల అని, ఒక్కసారి థియేటర్లలోకి వచ్చిన తర్వాత దానిని మార్చలేమని జితిన్ వ్యాఖ్యానించారు. కొద్ది నెలలు ఆలస్యమైనా మంచి చిత్రాన్ని అందించడమే అందరి లక్ష్యమని తెలిపారు. దర్శకనిర్మాతలు, నటీనటులు అంతా వర్క్ అవుట్‌పుట్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారని, ఏ విషయంలోనూ రాజీ పడే ప్రసక్తే లేదని నొక్కి చెప్పారు.
హను రాఘవపూడిని పర్ఫెక్షనిస్ట్‌గా కొనియాడిన జితిన్, ఆయనతో పనిచేయడం గొప్ప అనుభూతినందించిందని కొనియాడారు. ఈ చిత్రంలో భారీ విజువల్ స్కేల్ , డెప్త్ ఉన్నప్పటికీ మానవ సంబంధాలు, భావోద్వేగాలకు దర్శకుడు పెద్దపీట వేసారన్నారు. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల్లో చిన్న చిన్న వివరాలను పట్టించుకోరనే అభిప్రాయం ఉంటుంది. కానీ `ఫౌజీ` విషయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.
ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత లు సైతం ఓ వేదికపై `ఫౌజీ` వాయిదా వార్తను ధృవీకరించిన సంగతి తెలిసిందే. `బాహుబలి` తర్వాత ప్రభాస్ ఎంతో గ్రాండ్ లుక్‌లో కనిపించబోతున్న ప్రాజెక్ట్ ఇదని, ప్రేక్షకులు జీవితాంతం గుర్తుంచుకునేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కాంబినేషన్ తెచ్చే విజువల్ వండర్ కోసం ప్రేక్షకులు ఇంకొన్ని రోజులు వేచి చూడటం ఖచ్చితంగా విలువైనదే అవుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్వీ ఇస్మైల్ కథానాయకిగా నటిస్తోంది. బాలీవుడ్ దిగ్గజ నటి జయ ప్రద, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
