డార్లింగ్ క్యాలెండర్‌లో డేట్ల పంచాయితీ
పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ప్లానింగ్ ఎప్పుడూ ఒక పజిల్ లాంటిదే. చేతినిండా భారీ ప్రాజెక్టులు ఉన్నప్పుడు ఒక సినిమా రిలీజ్ డేట్ మారితే మిగిలిన ప్రాజెక్టులన్నీ పేకమేడలా కదిలిపోతాయి.
By: M Prashanth | 17 Sept 2026 9:58 AM ISTపాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ప్లానింగ్ ఎప్పుడూ ఒక పజిల్ లాంటిదే. చేతినిండా భారీ ప్రాజెక్టులు ఉన్నప్పుడు ఒక సినిమా రిలీజ్ డేట్ మారితే మిగిలిన ప్రాజెక్టులన్నీ పేకమేడలా కదిలిపోతాయి. ప్రస్తుతం హను రాఘవపూడి ఫౌజీ చుట్టూ నడుస్తున్న టాక్ చూస్తుంటే అదే రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. డిసెంబర్ 3 డేట్‌ను అందుకోవడం కష్టమనే ప్రచారం ఊపందుకోవడంతో, అసలు భారం సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మీద పడేలా ఉంది.
ఈ ఏడాది సంక్రాంతికి రాజాసాబ్‌తో వచ్చిన ప్రభాస్, ఆ తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదు. ప్లాన్ ప్రకారం డిసెంబర్‌లో ఫౌజీ వస్తే ఏడాదికి రెండు సినిమాలు పడేవి. అలా కాకుండా ఫౌజీని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26కి జరిపితే, దాదాపు ఏడాది పాటు ప్రభాస్ నుంచి మరో సినిమా ఉండదు. అంతటి లాంగ్ గ్యాప్ తర్వాత సరిగ్గా ఐదు వారాల వ్యవధిలోనే మళ్లీ స్పిరిట్ రంగంలోకి దిగాల్సి వస్తుంది.
స్పిరిట్ మేకర్స్ ఇప్పటికే 2027 మార్చి 5వ డేట్‌ను లాక్ చేసి కూర్చున్నారు. ఒకే హీరో నటించిన రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులను కేవలం నెల రోజుల గ్యాప్‌లో వదిలితే ట్రేడ్ లెక్కలు తారుమారవుతాయి. ఒక సినిమా ఓపెనింగ్స్, లాంగ్ రన్ కలెక్షన్లను మరొకటి మింగేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. దీంతో ఫౌజీ ముందుకు జరిగితే స్పిరిట్ కూడా వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
అసలు ఫౌజీ ఎందుకు లేట్ అవుతుందంటే కారణం గ్రాఫిక్స్ పనులే. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఫ్రేమ్ ఫ్రేమ్‌కూ వీఎఫ్ఎక్స్ క్వాలిటీ కీలకం. ఎన్ని యూనిట్లతో షూట్ లాగించినా కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులను తొందరపెట్టలేరు. దర్శకుడు హను రాఘవపూడి క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకపోవడమే ఈ లేట్ వెనుక అసలు పాయింట్ అని తెలుస్తోంది.
ఫౌజీ దేశభక్తి బ్యాక్‌డ్రాప్ కథ కావడంతో జనవరి 26 రిపబ్లిక్ డే అనేది నిజానికి ఒక గోల్డెన్ డేట్. ప్రమోషన్లకు చాలా బాగా కలిసొస్తుంది. కానీ స్పిరిట్ ప్లాన్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే మాత్రం హను రాఘవపూడి డిసెంబర్ టార్గెట్‌ను కచ్చితంగా అందుకోవాల్సి ఉంటుంది. అటు టీమ్‌లోని కొందరు నటులు ఇప్పటికీ డిసెంబర్ 3కే వస్తామని నమ్మకంగా చెబుతున్నారు. ఇక ఫౌజీకి ఏ డేట్ ఫిక్స్ చేస్తారనే దానిపైనే ప్రభాస్ భవిష్యత్ లైనప్ మొత్తం ఆధారపడి ఉంది. డిసెంబర్‌ను ఎలాగోలా అందుకుంటారా లేక స్పిరిట్‌ను కాస్త పక్కకు జరిపి రిపబ్లిక్ డే బరిలోకి దిగుతారా అనేది చూడాలి. ఫౌజీ మేకర్స్ నుంచి వచ్చే నెక్స్ట్ అనౌన్స్‌మెంట్‌తోనే ఈ డేట్ల గందరగోళానికి తెరపడే అవకాశం ఉంది.
