Begin typing your search above and press return to search.

ఫౌజీకి కలిసొచ్చిన ప్రభాస్ మార్కెట్.. అప్పుడే సగానికి పైగా రికవరీ!

ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ 'హోంభలే ఫిల్మ్స్' సొంతం చేసుకోవడం సినిమాపై అంచనాలను పెంచేసింది.

By:  Madhu Reddy   |   17 July 2026 10:00 PM IST
ఫౌజీకి కలిసొచ్చిన ప్రభాస్ మార్కెట్.. అప్పుడే సగానికి పైగా రికవరీ!
X

రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు లోకల్ కాదు, పక్కా గ్లోబల్. 'బాహుబలి' నుండి నిన్నటి 'కల్కి 2898 AD' వరకు ఆయన సృష్టించిన బాక్సాఫీస్ రికార్డులే దీనికి నిదర్శనం. ప్రస్తుతం దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న 'ఫౌజీ' చిత్రం షూటింగ్ దశలోనే ట్రేడ్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఒకే ఒక్క రిలీజ్ డేట్ పోస్టర్, ప్రభాస్ క్రేజ్ తోడై ఈ చిత్రం విడుదలకు ముందే పెట్టుబడిలో సగానికి పైగా రికవరీ సాధించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదొక సాధారణ సినిమా కాదు, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించబోయే విజువల్ ఎపిక్ అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

కళ్ళు చెదిరే ఓటీటీ డీల్ - ప్రభాస్ బ్రాండ్ పవర్:

దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే సినిమా థియేటర్లలోకి రాకముందే కేవలం సౌత్ ఇండియా భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులే రికార్డు స్థాయిలో రూ.170 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇక హిందీ మరియు మిగతా రైట్స్ ఇంకా లెక్కల్లోకి రాకుండానే ఈ స్థాయి బిజినెస్ జరగడం ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ మార్కెట్‌కు నిదర్శనం. దీని బట్టి చూస్తే మేకర్స్‌కు బడ్జెట్ పరంగా సగానికి పైగా సేఫ్ జోన్ వచ్చేసినట్లే.

ఓవర్సీస్ లో హోంభలే హంగామా - నార్త్ అమెరికా గ్రాండ్ రిలీజ్:

ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ 'హోంభలే ఫిల్మ్స్' సొంతం చేసుకోవడం సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రభాస్ మార్కెట్ స్టామినాకు, హోంభలే ఫిల్మ్స్ పంపిణీ వ్యూహాలు తోడైతే ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

డిసెంబర్ 3న దండయాత్ర:

ఇటీవల విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ ప్రేక్షకులకు పూస్‌బంప్స్ తెప్పించింది. 1940ల బ్రిటీష్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో, రక్తమోడుతున్న దుస్తులతో, చేతిలో కత్తి పట్టుకుని దీర్ఘాలోచనలో ఉన్న ప్రభాస్ లుక్ సినిమాలోని అసలైన భావోద్వేగాలను ప్రతిఫలించింది. ఇక ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ లాంటి దిగ్గజాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 3న థియేటర్లలోకి రానుంది.

ఒక సినిమాపై నమ్మకం ఎంత బలంగా ఉంటే విడుదలకు ముందే ఇలాంటి రికార్డులు సాధ్యమవుతాయో 'ఫౌజీ' నిరూపిస్తోంది. హను రాఘవపూడి మార్క్ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామాకు ప్రభాస్ మాస్ కటౌట్ తోడవడంతో బిజినెస్ పరంగా ఈ చిత్రం ముందే సగం విజయం సాధించింది. థియేట్రికల్, డిజిటల్ పరంగా ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ 'ఫౌజీ' దండయాత్ర డిసెంబర్ 3న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.