ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెర పడేది ఎప్పుడో?
ఈ ఏడాది ఆరంభంలో 'రాజాసాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, మరో సినిమాను ఇదే ఏడాదిలో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తాడని అంతా భావించారు.
By: Ramesh Palla | 2 July 2026 3:00 PM ISTఈ ఏడాది ఆరంభంలో 'రాజాసాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, మరో సినిమాను ఇదే ఏడాదిలో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తాడని అంతా భావించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమా ఖచ్చితంగా 2026లోనే విడుదల ఉంటుందని మొన్నటి వరకు అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే ఫౌజీ సినిమా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఫౌజీ షూటింగ్ చకచక జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా మొదలైందో అప్పటి నుంచి ఫౌజీ ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అందుకు కారణం స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి కంటిన్యూగా డేట్లు ఇవ్వాలని ప్రభాస్‌కి ముందుగానే సందీప్ రెడ్డి వంగ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అందుకు ప్రభాస్ ఓకే అన్నాడట.
ప్రభాస్ స్పిరిట్ మూవీ షూటింగ్...
ప్రభాస్ ఇచ్చిన మాట ప్రకారం స్పిరిట్ సినిమాకు బల్క్ డేట్లు ఇస్తూ వస్తున్నాడు. సందీప్ కోరిన సమయంలో ప్రభాస్ అందుబాటులో ఉంటున్నాడట. అంతే కాకుండా బాడీ డబుల్ లేకుండా పూర్తిగా ప్రభాస్ స్పిరిట్ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో ప్రభాస్ కాస్త ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు, ఎక్కువ కష్టపడుతున్నట్లు యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. స్పిరిట్ సినిమాను కేవలం ఆరు నెలల వర్కింగ్ డేస్‌తోనే పూర్తి చేసే విధంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసుకున్నాడు. అందుకు తగ్గట్టుగా ప్రభాస్ నుంచి సహకారం అందుతుంది. దాంతో వచ్చే ఏడాదిలో అనుకున్న సమయంకు స్పిరిట్ సినిమా విడుదల ఉంటుందని సమాచారం అందుతోంది. అయితే ఫౌజీ సినిమా విషయంలో మాత్రం ఆలస్యం తప్పదని తెలుస్తోంది. స్పిరిట్ కోసం ఫౌజీ కాస్త ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
హను రాఘవపూడి ఫౌజీ మూవీ...
హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా అంటే కూల్ అండ్ కామ్‌గా సాగుతుంది. ప్రభాస్ చాలా కాలం తర్వాత ఒక కంప్లీట్ ఫీల్ గుడ్ మూవీని చేస్తున్నాడని అభిమానులు చాలా ఉత్సాహంగా ఫౌజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సినిమా ఇదే ఏడాదిలో ఉంటుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. కానీ సినిమా షూటింగ్ జాప్యం కారణంగా ఈ ఏడాదిలో ఫ్యాన్స్ కి పండగ లేనట్లే అనిపిస్తుంది. హను రాఘవపూడి మూవీ అంటే మినిమం ఉంటుందని అన్ని వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. ఎప్పుడు వచ్చినా ఫౌజీ మినిమం గ్యారెంటీ హిట్ కొడుతుందని ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా హను రాఘవపూడి గత చిత్రం సీతారామం సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. అందుకే ప్రభాస్ తో ఆ రేంజ్ సినిమా తీస్తే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం అని బాక్సాఫీస్ వర్గాల వారు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాజాసాబ్ సినిమా తర్వాత ప్రభాస్...
గత ఏడాది విడుదల కావాల్సిన రాజాసాబ్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చింది. సినిమా ఫలితం తీవ్రంగా నిరాశ పరిచింది. దర్శకుడు మారుతి ఇలా చేశాడేంటి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ సమయంలోనే రాబోయే మూవీ ఫౌజీ కనుక ఈ డ్యామేజీ అంతా కంట్రోల్ చేస్తుందని ఫ్యాన్స్ భావించారు. సాధారణంగా ఏ హీరో అయినా ఒక మూవీ నిరాశ పరిస్తే వెంటనే మరో సినిమాను వదలాలి అనుకుంటారు.. కానీ ప్రభాస్ అలా కాకుండా స్లో అండ్ స్టడీ అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. ఏడాదిలో కచ్చితంగా రెండు సినిమాలు చేస్తాను, విడుదల చేస్తాను అని గతంలో ప్రభాస్ ఇచ్చిన హామీ ఈసారి కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేనట్లే. ఫౌజీ, స్పిరిట్ సినిమాలు వచ్చేది ఎప్పుడో...? ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెర పడేది ఎప్పుడో కాలమే నిర్ణయించాలి. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా ప్రభాస్ సలార్, కల్కి 2 సినిమాలు సైతం ఫ్యాన్స్ ను ఊరిస్తున్నాయి. వాటి కోసం ఎదురు చూపులు ఎన్నాళ్ళు కొనసాగాలో చూడాలి.
