Begin typing your search above and press return to search.

ఫౌజీ గ్లింప్స్‌.. ఇదేమి రెబల్ మాస్ రా బాబు..!

ఈ గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   23 Oct 2026 9:51 PM IST
ఫౌజీ గ్లింప్స్‌.. ఇదేమి రెబల్ మాస్ రా బాబు..!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

హను రాఘవపూడి నుంచి ఈ మధ్య వచ్చిన సీతారామం సినిమా ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒక క్లాసిక్ సినిమా లాగా మిగిలింది. దీంతో ప్రభాస్‌తో ఆయన చేయబోయే సినిమా కూడా అదే తరహాలో సాఫ్ట్‌గా ఉంటుందని కొందరు భావించారు. కానీ ఫౌజీ గ్లింప్స్ చూస్తే మాత్రం అంచనాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇందులో యాక్షన్, దేశభక్తి, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో పాటు అదిరిపోయే ఎలివేషన్స్ ఈ దర్శకుడు ప్లాన్ చేసినట్లు ఈ గ్లిమ్స్ చూస్తేనే తెలిసిపోతుంది.

ఈ గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు జర్మనీ సహాయం కావాలని సుభాష్ చంద్రబోస్ కోరుతారు. అయితే భారతీయుల రక్తంలో రెండు శతాబ్దాలుగా బానిసత్వం ఉందని హిట్లర్ అవమానకరంగా మాట్లాడతాడు.

దీనికి సుభాష్ చంద్రబోస్ గట్టిగా సమాధానం ఇస్తారు. తన దేశానికి స్వాతంత్య్రం సాధించడానికి ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా పోరాడతానని చెబుతారు. యుద్ధాల్లో కలలు గెలిపించవని, తెలివితేటలే విజయాన్ని అందిస్తాయని హిట్లర్ అంటాడు. దానికి సమాధానంగా జపాన్ బ్రిటిష్ సైన్యాన్ని ఎలా దెబ్బతీసిందో సుభాష్ చంద్రబోస్ వివరిస్తారు.

ఈ సంభాషణలోనే అసలు కథానాయకుడి గురించి ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. బ్రిటిష్ సైన్యానికి తెలియకుండా వారి సమాచార వ్యవస్థను దెబ్బతీసే ఒక భారతీయ సైనికుడు ఉన్నాడని సుభాష్ చంద్రబోస్ చెబుతారు. అతను ఒక సైనికుడు మాత్రమే కాదు.. వ్యూహకర్త, గూఢచారి కూడా. భగవద్గీత ఆధారంగా ఎవరూ ఛేదించలేని రహస్య కోడ్‌ను రూపొందించాడని వివరిస్తారు.

ఆ వ్యక్తిని బ్రిటిష్ వాళ్లు ఫౌజీ అని పిలుస్తారని చెప్పడంతో కథపై ఆసక్తి మరింత పెరుగుతుంది.

గ్లింప్స్ చివర్లో ప్రభాస్ ఎంట్రీ ప్రత్యేక ఒక పెద్ద ఆకర్షణగా నిలిచింది. ఆయన కనిపించే సమయంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చేలా ఉంది. దేశం కోసం పోరాడే యోధుడిగా ప్రభాస్‌ను చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. ఊర మాస్ లుక్ లో ఇక్కడ ప్రభాస్ అభిమానులకే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడా గూస్ బంప్స్ తెప్పించారు అని చెప్పడంలో సందేహం లేదు.

ఫౌజీ గ్లింప్స్ చూస్తుంటే హను రాఘవపూడి ఈసారి ఆయన తీసే ప్రేమకథకు భిన్నంగా యాక్షన్, దేశభక్తి, చారిత్రక నేపథ్యంతో కూడిన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రభాస్‌ను ఈ సినిమాలో హను రాఘవపూడి ఎలా చూపించబోతున్నారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.