Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ 'ఫౌజీ'.. సర్ ప్రైజ్ ఏమిటంటే..

"ఈ సినిమాలో ప్రభాస్ ప్రపంచంలోని ఒక కోణాన్ని మాత్రమే చూపిస్తున్నాం. రెండో భాగం (ప్రీక్వెల్)లో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాం" అని ఆయన తెలిపారు.

By:  M Prashanth   |   17 Nov 2025 8:38 PM IST
ప్రభాస్‌ ఫౌజీ.. సర్ ప్రైజ్ ఏమిటంటే..
X

'సీతారామం' లాంటి ఒక అద్భుతమైన ప్రేమకావ్యాన్ని తెరకెక్కించిన హను రాఘవపూడి తన తదుపరి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు "ఫౌజీ" అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచీ అంచనాలు హై లెవెల్ లో ఉండగా, ఇప్పుడు మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌పై ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇచ్చారు.

సాధారణంగా ఒక సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ వస్తుంది. కానీ, 'ఫౌజీ' విషయంలో మేకర్స్ ఒక ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాను ఏకంగా రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో అసలైన ట్విస్ట్ ఏమిటంటే, రెండో భాగం సీక్వెల్ కాదు.. 'ప్రీక్వెల్'గా రాబోతోంది. అంటే, అసలు కథకు ముందు ఏం జరిగిందో రెండో భాగంలో చూపించనున్నారు.

ఈ అరుదైన ప్లాన్ వెనుక దర్శకుడు హను రాఘవపూడి బలమైన కారణాన్నే చెప్పారు. ఇటీవల నేషనల్ మీడియాకు ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. "ఈ సినిమాలో ప్రభాస్ ప్రపంచంలోని ఒక కోణాన్ని మాత్రమే చూపిస్తున్నాం. రెండో భాగం (ప్రీక్వెల్)లో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాం" అని ఆయన తెలిపారు.

భారతదేశ వలస పాలన కాలం నాటి ఎన్నో గొప్ప కథలు మనకు తెలియవని, వాటిని వెలికితీయడానికి తనవద్ద అపారమైన మెటీరియల్ ఉందని అన్నారు. "చరిత్రలో విషాదకరంగా ముగిసిన ఎన్నో కథలు ఉన్నాయి, కానీ మరో వాస్తవికతలో చూస్తే అవి అద్భుతమైన ప్రేమ కావ్యాలుగా ఉంటాయి. అలాంటి కొన్ని నిజ జీవిత అనుభవాల స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నాను" అని హను రాఘవపూడి చెప్పిన మాటలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

'సీతారామం'లో కూడా ఆయన ఇలాంటి టచింగ్ పాయింట్‌నే చూపించారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ మళ్లీ పూర్తిస్థాయిలో నటిస్తున్న ఎపిక్ పీరియడ్ డ్రామా ఇదే కావడం విశేషం. ఒక సైనికుడి అత్యంత ధైర్యవంతమైన కథ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. 'పుష్ప' మేకర్స్ అయిన మైత్రీ వారు, ఈ సినిమాను తమ బ్యానర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిర్మిస్తున్నారు. చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఫిక్షనల్ డ్రామాలో, ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నారో, అసలు ఈ ప్రీక్వెల్ ప్లాన్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.