ఆ లిస్ట్ లోకి డార్లింగ్ కూడానా?
ఇప్పటికే బాహుబలి1, బాహుబలి2 చేసిన ప్రభాస్ సలార్2, కల్కి2 రూపంలో సీక్వెల్ సినిమాలను లైన్ లో పెట్టగా, ఇప్పుడు ఓ ప్రీక్వెల్ సినిమాను కూడా ఆ లిస్ట్ లోకి చేర్చనున్నట్టు తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 11 Oct 2025 4:00 PM ISTఇండియన్ సినిమాలో ప్రస్తుతం సీక్వెల్స్, ప్రీక్వెల్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. ముందు ఒక సినిమాగా మొదలవడం, తర్వాత కథ పెద్దదైందని, మొత్తం కథను ఒకే సినిమాలో చెప్పలేకపోతున్నామని, దాన్ని రెండు భాగాలుగా తీసుకురావడం ట్రెండ్ గా మారింది. సీక్వెల్స్ కథలు ఈ కారణంతో ఎక్కువగా వస్తుంటే, ఏదైనా సినిమా రిలీజయ్యాక అది బావుండి, దానికి సీక్వెల్ ఆప్షన్ లేకపోతే ప్రీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
కాంతారకు ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార1
రీసెంట్ గా వచ్చిన కాంతార చాప్టర్1 ఆ కోవలోకే వస్తుంది. 2022లో వచ్చిన కాంతార బ్లాక్ బస్టర్ కావడంతో ఆ సినిమాకు ప్రీక్వెల్ కాంతార1 ను తీసి ఈ మూవీతో మరో సక్సెస్ ను అందుకున్నారు రిషబ్ శెట్టి. మొన్నామధ్య కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అయితే ఓ అడుగు ముందుకేసి వీరధీర శూరన్2 అనే సినిమాను చేసి, ఆ సినిమా తర్వాత మొదటి భాగాన్ని చేస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరచగా, వీర ధీర శూరన్2 ఫ్లాపవడంతో ఆ ప్రీక్వెల్ గురించి మళ్లీ ఎలాంటి వార్త బయటకు రాలేదు.
ఫౌజీకి ప్రీక్వెల్
అయితే ఇప్పుడు ఈ ప్రీక్వెల్ లిస్ట్ లోకి మరో మూవీ రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాహుబలి1, బాహుబలి2 చేసిన ప్రభాస్ సలార్2, కల్కి2 రూపంలో సీక్వెల్ సినిమాలను లైన్ లో పెట్టగా, ఇప్పుడు ఓ ప్రీక్వెల్ సినిమాను కూడా ఆ లిస్ట్ లోకి చేర్చనున్నట్టు తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ అనే పీరియాడిక్ డ్రామాను ఓ సిరీస్ గా తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారట.
60% షూటింగ్ పూర్తి
అందులో భాగంగానే ఈ సినిమాకు ప్రీక్వెల్ చేయాలని ప్లాన్ వేస్తున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. ఇప్పటికే ఫౌజీ సినిమా షూటింగ్ 60% పూర్తవగా, మరో 35 రోజులు ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ చేస్తే మిగిలిన సినిమా కూడా పూర్తవుతుందని తెలుస్తోంది. దేశ భక్తి, యుద్ధం, త్యాగం అనే అంశాల చుట్టూ తిరిగే ఈ కథ, రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యం ఆధారంగా తెరకెక్కుతుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఫౌజీని నిర్మిస్తోంది. అయితే ఇప్పటికే పలు సినిమాలు చేయాల్సిన ప్రభాస్, ఒకవేళ నిజంగా ఫౌజీకి ప్రీక్వెల్ ఉన్నా కూడా ఆ సినిమా రావడానికి చాలానే టైమ్ పడుతుంది.
