మొన్న మెగా157, ఇప్పుడు ఫౌజి.. దేన్నీ వదలడం లేదుగా!
ఈ లీకుల వల్ల సినిమాపై ఉన్న ఆసక్తి తగ్గిపోతుందని మేకర్స్ కంగారు పడతున్నారు. ఒకప్పటితో పోలిస్తే నిర్మాణ సంస్థలు కూడా బాగా అప్డేట్ అయ్యాయి.
By: Sravani Lakshmi Srungarapu | 20 Aug 2025 12:18 PM ISTటెక్నాలజీ విపరతంగా పెరిగిపోవడంతో సినిమా మేకర్స్ కు లీకుల బెడద బాగా ఎక్కువైపోయింది. షూటింగ్ స్పాట్ నుంచి ఎవరొకరు తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం, క్రేజ్ ఎక్కువున్న సినిమాలవడంతో ఆ ఫోటోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవడం బాగా ఎక్కువగా జరుగుతోంది. మేకర్స్ ఈ లీకుల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటిని మాత్రం అరికట్టలేకపోతున్నారు.
ఈ లీకుల వల్ల సినిమాపై ఉన్న ఆసక్తి తగ్గిపోతుందని మేకర్స్ కంగారు పడతున్నారు. ఒకప్పటితో పోలిస్తే నిర్మాణ సంస్థలు కూడా బాగా అప్డేట్ అయ్యాయి. అందుకే ఆడియన్స్ ఇంట్రెస్ట్ ను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తమ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తున్నాయి. అయినప్పటికీ ఈ లీకుల బెడద మాత్రం తగ్గడం లేదు.
మెగా157 నుంచి ఓ వీడియో లీక్
మొన్నటికి మొన్న అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంబంధించిన ఓ వీడియో లీకై సోషల్ మీడియాలో వైరల్ అవగా, ఆ ఇష్యూపై మేకర్స్ స్పందిస్తూ ఇలాంటి లీకులకు పాల్పడినా, వాటిని షేర్ చేసినా కాపీ రైట్స్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇప్పుడలాంటి సమస్యే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకొచ్చింది.
ఫౌజి నుంచి ఫోటో లీక్
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజి సినిమా సెట్స్ నుంచి ఓ ఫోటో లీకవగా, ఆ ఫోటోలో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించారు. దీంతో క్షణాల్లో ఆ ఫోటో నెట్టింట వైరల్ అయింది. ఈ విషయంపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందిస్తూ లీకైన ఫోటో షేర్ చేస్తున్న వారికి, లీకులు చేసే వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
ఆడియన్స్ కు అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్ ను ఇవ్వడానికి మేం శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, సెట్స్ నుంచి ఇలాంటి లీకులు టీమ్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని, లీక్ ఫోటోలు షేర్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లను తొలగించడమే కాకుండా సైబర్ నేరం కింద పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏదేమైనా చిత్ర మేకర్స్ ఎంత జాగ్రత్త పడినా ఈ లీకులు మాత్రం ఆగకుండా వారిని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఇక ఫౌజి సినిమా విషయానికొస్తే పీరియాడికల్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ బిటీష్ ఆర్మీ సైనికుడిగా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
