Begin typing your search above and press return to search.

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్ 2’ కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ రెండు భాగాల విడుదలపై 2027, 2028 తేదీలు ప్రచారంలోకి రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘సలార్ 2’ షూటింగ్‌ను 2027 సమ్మర్‌లో ప్రారంభిస్తానని నీల్ గతంలో చెప్పిన నేపథ్యంలో, సినిమా విడుదలపై స్పష్టత ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.

By:  Ramesh Palla   |   19 Nov 2026 12:00 AM IST
సలార్‌ 2 రాకుండానే డ్రాగన్‌ 2 వస్తుందా?
X

ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా 'సలార్‌ 2' కోసం ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ 'సలార్‌' మూవీని రెండో పార్ట్‌ కోసం ఆసక్తికరమైన పాయింట్‌ వద్ద, ఎన్నో ప్రశ్నలతో ఆపేసిన విషయం తెల్సిందే. సలార్‌ 1 ముగింపు వద్ద ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నింటికి సలార్‌ 2 లో సమాధానాలు లభించబోతున్నాయి. అందుకే సలార్‌ 2 కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా రేంజ్‌లో ఉన్న యాక్షన్‌ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదుగో ఇదుగో అంటూ సలార్‌ 2 ను ఏళ్లకు ఏళ్లు వాయిదా వేస్తూ వస్తున్నారు. మొదటి పార్ట్‌ షూటింగ్‌ సమయంలోనే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ 2 కి సంబంధించిన షూట్‌ ను దాదాపుగా 50 శాతం పూర్తి చేశాడని, రెండు మూడు నెలల వర్కింగ్‌ డేస్‌తో సలార్‌ 2 పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ ఆ రెండు మూడు నెలల షూటింగ్‌కు మరీ ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.

సలార్‌ 2 సినిమా కోసం వెయిటింగ్‌...

ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ 2 సినిమాను పక్కన పెట్టి ఇప్పటికే ఎన్టీఆర్‌తో డ్రాగన్‌ మూవీని పట్టాలెక్కించాడు. ఎన్టీఆర్‌ డ్రాగన్‌ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఎన్టీఆర్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో డ్రాగన్‌ మూవీని కచ్చితంగా 2027 సమ్మర్‌ లో విడుదల చేస్తామని నిర్మాతలు నమ్మకంగా చెప్తున్నారు. ఈమద్య కాలంలో డ్రాగన్‌ సినిమాను రెండు పార్ట్‌లుగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండో పార్ట్‌ను 2027 డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ 2027 డిసెంబర్‌లో విడుదల సాధ్యం కాకుంటే కచ్చితంగా 2028 సమ్మర్‌లో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ నుంచి అనధికారిక సమాచారం అందుతోంది. మొత్తానికి డ్రాగన్‌ రెండు పార్ట్‌లకు సంబంధించిన విడుదల తేదీలపై క్లారిటీ ఉంది.

ఎన్టీఆర్‌ డ్రాగన్‌ రెండు పార్ట్‌లు...

సలార్‌ 2 కోసం చూస్తున్న ప్రేక్షకులు డ్రాగన్‌ 2 సినిమా అప్‌డేట్‌ కూడా రావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ ఫ్యాన్స్ ఈ విషయంలో ప్రశాంత్‌ నీల్‌ను సోషల్‌ మీడియా ద్వారా గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో చేయాల్సిన సలార్‌ 2 ను ఇంకా మొదలు పెట్టకుండా, డ్రాగన్‌ రెండో పార్ట్‌ ను సైతం విడుదల చేసేందుకు డేట్‌ ను అనుకోవడం ఏంటని, తమ హీరో ప్రభాస్‌ సినిమా సలార్‌ 2 విషయంలో ఏదో ఒకటి తేల్చాలి అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రశాంత్‌ నీల్‌ నుంచి సలార్‌ 2 ఎప్పుడు వచ్చేది క్లారిటీ లేదు. అయితే ఆ మద్య ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో సలార్‌ 2 షూటింగ్‌ను 2027 సమ్మర్‌ లో ప్రారంభించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. అంటే సినిమా 2028 లేదా 2029లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సలార్‌ కి ఉన్న బజ్‌ నేపథ్యంలో సలార్‌ 2 ను వెంటనే విడుదల చేసి ఉంటే ఓపెనింగ్స్ అదిరి పోయేవి అనేది చాలా మంది అభిప్రాయం.

ప్రభాస్‌ కల్కి 2 సినిమా షూటింగ్‌...

ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల జాబితాలో నిలిచిన సలార్‌ సినిమాకు సీక్వెల్‌ చేస్తే అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదు. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే సినిమా సీక్వెల్‌ను చేసి విడుదల చేసి ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు. అయితే కేజీఎఫ్‌ 1 కి కేజీఎఫ్‌ 2 కి కూడా కాస్త ఎక్కువ సమయం ఉంది, కనుక సలార్‌ 2 సినిమా విడుదల సమయంలో కచ్చితంగా ప్రశాంత్‌ నీల్‌ ఏదో ఒక మ్యాజిక్ చేసి సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తాడనే విశ్వాసంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సలార్‌ 2 సినిమా విడుదల కాకుండానే డ్రాగన్‌ 2 వార్తలు సైతం రావడంను ప్రభాస్ ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేక పోతున్నారు. మరో వైపు ప్రభాస్‌ కల్కి 2 సినిమా విషయంలోనూ ఇదే గందరగోళం నెలకొన్న విషయం తెల్సిందే.