Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఫ్యాన్స్.. ఇన్ని రోజులు ఆగి ఇప్పుడేంటి?

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అని తొలిసారి వార్త బయటికి వచ్చినపుడు రెబల్ ఫ్యాన్స్ ఎంతగా వ్యతిరేకించారో తెలిసిందే.

By:  Garuda Media   |   23 Jan 2026 1:04 PM IST
ప్రభాస్ ఫ్యాన్స్.. ఇన్ని రోజులు ఆగి ఇప్పుడేంటి?
X

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అని తొలిసారి వార్త బయటికి వచ్చినపుడు రెబల్ ఫ్యాన్స్ ఎంతగా వ్యతిరేకించారో తెలిసిందే. సోషల్ మీడియాలో కొన్ని రోజుల పాటు ఈ సినిమా వద్దే వద్దు అంటూ హ్యాష్ ట్యాగ్‌లు పెట్టి పెద్ద ఎత్తున ట్రెండ్స్ చేశారు కూడా. కానీ ఈ సినిమా ముందుకు సాగేకొద్దీ వారిలో వ్యతిరేకత తగ్గుతూ వచ్చింది. రిలీజ్ టైంకి మారుతిని నెత్తిన పెట్టుకుని మోశారు. కానీ వారి నమ్మకాన్ని నిలబెట్టే సినిమాను అందించలేకపోయాడు మారుతి.

సంక్రాంతి రేసులో ముందుగా వచ్చిన ఈ చిత్రం.. డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు మిగతా సంక్రాంతి సినిమాలకు దీంతో పోలిస్తే బెటర్ టాక్ రావడం ప్రభాస్ చిత్రానికి మైనస్ అయింది. సంక్రాంతి సెలవుల వల్ల వసూళ్లు ఓ మోస్తరుగా వచ్చాయి కానీ.. అంతిమంగా చూస్తే ‘రాజాసాబ్’ డిజాస్టరే అయింది. ఐతే సినిమా రన్ కొనసాగుతుండగా.. ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి మీద పెద్దగా ఎటాక్ చేయలేదు. అతడికి మద్దతుగానే నిలిచారు.

కానీ ‘రాజాసాబ్’ థియేట్రికల్ రన్ ముగిసినట్లే అని ఒక నిర్ణయానికి వచ్చాక.. ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ అలెర్ట్ అయిపోయారు. మారుతితో పాటు ‘రాజాసాబ్’కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన అతడి మిత్రుడు ఎస్కేఎన్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ గత రెండు రోజులుగా మామూలుగా టార్గెట్ చేయట్లేదు. దారుణమైన హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఇద్దరినీ అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు.

సినిమా నిన్నో మొన్నో రిలీజైనట్లుగా.. అందులోని సన్నివేశాల గురించి విశ్లేషిస్తూ మారుతిని బూతులు తిడుతున్నారు అభిమానులు. మిడ్ రేంజ్ సినిమాలు తీసుకునే నిన్ను నమ్మి ప్రభాస్ సినిమా చేస్తే.. ఇలాంటి ఔట్ పుటా ఇచ్చేది అని మండిపడుతున్నారు. సినిమా గురించి విడుదలకు ముందు ఎస్కేఎన్ విపరీతమైన హైప్ ఇచ్చిన నేపథ్యంలో తననూ వదలడం లేదు. ఇక్కడ గమనించాల్సిన ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే.. మారుతి‌కి మద్దతుగా కొన్ని ఎక్స్ అకౌంట్లు ప్రభాస్ అభిమానులకు దీటుగా బదులిస్తున్నాయి.

దర్శకుడి కోసం ఇలా స్వచ్ఛందంగా ఎక్స్‌ ఫ్యాన్స్ బలంగా నిలబడడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మొత్తానికి ఈ గొడవ చూస్తుంటే మారుతి.. ఇక మళ్లీ ప్రభాస్‌‌తో సినిమా చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది.