క్రేజీ ప్రాజెక్టును మిస్ చేసుకున్న డార్లింగ్
సినీ ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసుకున్న కథను మరొకరు చేయడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఇండస్ట్రీలో అలాంటివి చాలా కామన్ గా జరుగుతుంటాయి.
By: Sravani Lakshmi Srungarapu | 19 Jan 2026 5:00 PM ISTసినీ ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసుకున్న కథను మరొకరు చేయడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఇండస్ట్రీలో అలాంటివి చాలా కామన్ గా జరుగుతుంటాయి. ఒకరి కోసం కథ రాసుకోవడం, తర్వాత కొన్ని కారణాల వల్ల అది వేరే వారి చేతుల్లోకి వెళ్లడం ఎన్నోసార్లు జరిగాయి. అయితే అన్నీ వెంటనే బయటకు రావు. కొన్నిసార్లు అలాంటి విషయాలు వెంటనే బయటికొస్తే మరికొన్నిసార్లు అనుకోకుండా బయటకు వస్తాయి.
ప్రయోగాలు చేస్తూ వస్తున్న ప్రభాస్
ఇక అసలు విషయానికొస్తే పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తున్న డార్లింగ్, చేసిన జానర్లో సినిమాలు చేయకుండా వస్తున్నారు. వాస్తవానికి బాహుబలితో వచ్చిన క్రేజ్ ను కాపాడుకోవడానికి ప్రభాస్ స్థానంలో వేరే హీరో ఉండి ఉంటే ఎంతో ఆలోచించి సేఫ్ ప్రాజెక్టులు చేసుకుంటూ ఉండేవారు. కానీ ప్రభాస్ అలా కాకుండా ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు.
ధృవను మిస్ చేసుకున్న డార్లింగ్
అలాంటి ప్రభాస్ గతంలో ఓ క్రేజీ ప్రాజెక్టును మిస్ చేసుకున్నారట. అదే ధృవ. ఈ సినిమా గురించి తెలియని వారుండరు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన తని ఒరువన్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ముందుగా ప్రభాస్ తో చేద్దామనుకున్నారట. ప్రభాస్ కోసమే ఈ మూవీ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్టు డైరెక్టర్ మోహన్ రాజా రివీల్ చేశారు. ఒకవేళ ఆ సినిమాను ప్రభాస్ చేసి ఉంటే అప్పుడే డార్లింగ్ ను పోలీసాఫీసర్ గా చూసేవాళ్లం.
ప్రభాస్ వదులుకున్న ఆ సినిమా రామ్ చరణ్ వద్దకు వెళ్లగా, చరణ్ ధృవ మూవీతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చెర్రీ కెరీర్లోనే స్పెషల్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ విషయానికొస్తే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నట్టు ఇప్పటికే సందీప్ వెల్లడించారు.
