ప్రభాస్ ఎంట్రీతో.. 'కపుల్ ఫ్రెండ్లీ' రేంజ్ మారుతుందా?
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా థియేటర్లలో మొదట్లో మంచి సౌండ్ తోనే మొదలైంది.
By: M Prashanth | 20 Feb 2026 1:13 PM ISTసంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా థియేటర్లలో మొదట్లో మంచి సౌండ్ తోనే మొదలైంది. వాలెంటైన్స్ డే సందర్భంగా సైలెంట్‌గా విడుదలైన ఈ చిత్రం, మంచి టాక్ సంపాదించుకున్నా కూడా వీకెండ్ తరువాత ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కొంత ఇబ్బంది పడింది. సినిమా కథ బాగుందని, రివ్యూలు పాజిటివ్‌గా వచ్చినా సరే, సరైన హైప్ లేకపోవడం వల్ల ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేయడం కష్టంగా మారింది.
ఇలాంటి టైమ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాకు ప్రభాస్ మొదటి నుంచి సపోర్ట్‌గా ఉంటున్నారు. మొదట్లోనే ప్రభాస్ ఈ సినిమాపై సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వడం వల్ల ఒక్కసారిగా బజ్ పెరిగింది. అయితే, ఇప్పుడు లేటెస్ట్‌గా ప్రభాస్ ఇచ్చిన ఇంటర్వ్యూను మేకర్స్ రిలీజ్ చేసి మరికొంత సౌండ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ కనుక రిలీజ్‌కు ఒక వారం ముందే వచ్చి ఉంటే, సినిమాకు వచ్చే ఓపెనింగ్స్ మరో రేంజ్‌లో ఉండేవి అనేది ఇండస్ట్రీ వర్గాల మాట.
సాధారణంగా చిన్న సినిమాలకు పెద్ద స్టార్ల సపోర్ట్ ఉంటే అది ఎంతో ప్లస్ అవుతుంది. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ ఒక సినిమా గురించి మాట్లాడుతున్నారంటే, ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి నాలుగు రోజులు దాటిపోయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ రావడంతో, ఇది వసూళ్లపై ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆలస్యంగానైనా సరే, ప్రభాస్ ఎంట్రీతో థియేటర్ల దగ్గర సందడి పెరుగుతుందని చిత్ర యూనిట్ ఆశగా ఉంది.
లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అనే వెరైటీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ కథకు మెట్రో నగరాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. యూత్ ఆడియన్స్ ఈ సినిమాలోని ఎమోషన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నారు. ప్రభాస్ ఇచ్చిన సపోర్టింగ్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా చూసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రిలీజ్ తర్వాత వచ్చే ఇలాంటి స్టార్ ప్రమోషన్లు వీక్ డేస్‌లో సినిమాను నిలబెట్టడానికి ఉపయోగపడతాయి.
సంతోష్ శోభన్ తన నటనతో మరోసారి మెప్పించగా, మానస వారణాసి లుక్స్ సినిమాకు ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చాయి. యూవీ కాన్సెప్ట్స్ ఈ సినిమాను నేటి తరం ఆలోచనలకు తగ్గట్టుగా చాలా డీసెంట్‌గా నిర్మించింది. సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికేట్ ఇచ్చినా, సినిమాలోని ప్రేమకథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రభాస్ సపోర్ట్ తోడవ్వడంతో ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా స్పీడ్ పెంచేలా కనిపిస్తోంది. ఒక మంచి ప్రయత్నం జనాల్లోకి వెళ్లడానికి స్టార్ల ప్రోత్సాహం చాలా అవసరం. ప్రభాస్ ఇంటర్వ్యూ కనుక క్లిక్ అయితే, సెకండ్ వీక్ లో కూడా ఈ సినిమా మంచి జోరును కొనసాగించే అవకాశం ఉంది.
