Begin typing your search above and press return to search.

నెట్ వర్త్ లిస్ట్‌ లో లేకుంటే ఏంటి?.. మంచి మనసుతోనే..

ఆయన సంపాదన ఎంత అనేది కూడా బయట ప్రపంచానికి పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ మంచి పనులు చేసే విషయంలో మాత్రం ప్రభాస్ ఎప్పుడూ ముందే ఉంటారు.

By:  M Prashanth   |   28 Sept 2026 6:00 AM IST
నెట్ వర్త్ లిస్ట్‌ లో లేకుంటే ఏంటి?.. మంచి మనసుతోనే..
X

రెబల్ స్టార్ ప్రభాస్ పేరు పెద్ద పెద్ద నెట్ వర్త్ లిస్టుల్లో కనిపించకపోవచ్చు. ఆయన సంపాదన ఎంత అనేది కూడా బయట ప్రపంచానికి పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ మంచి పనులు చేసే విషయంలో మాత్రం ప్రభాస్ ఎప్పుడూ ముందే ఉంటారు. సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని అవసరంలో ఉన్నవారికి అందిస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు.

సినిమాల పరంగా ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా భారీ మార్కెట్‌ ను సొంతం చేసుకున్నారు. ఒక్కో సినిమాకు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్తలు కూడా చాలాకాలంగా వినిపిస్తున్నాయి.

అయితే ఒక నటుడి రెమ్యూనరేషన్, నెట్ వర్త్ రెండూ ఒకటి కాదు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బులో టాక్సులు, ఖర్చులు, పెట్టుబడులు, కుటుంబ బాధ్యతలు ఇలా ఎన్నో ఉంటాయి. అందుకే బయట కనిపించే లెక్కలతో ఒక స్టార్ అసలు సంపదను అంచనా వేయడం అంత ఈజీ కాదు. ప్రభాస్ విషయంలో మరో విషయం ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన చేసే సేవా కార్యక్రమాలు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు భారీ మొత్తాల్లో విరాళాలు అందించారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్స్‌ కు సాయం చేశారు.

కేరళలో వయనాడ్ విపత్తు సమయంలో కూడా బాధితుల కోసం విరాళం ఇచ్చారు. కరోనా సమయంలోనూ ప్రభాస్ భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేశారు. కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల సహాయ నిధులకు విరాళాలు అందించారు. ఆ సమయంలో సినిమా కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా అండగా నిలిచారు. కరోనా క్రైసిస్ ఛారిటీకి సాయం చేశారు.

సినిమా రంగానికి మాత్రమే కాకుండా పర్సనల్ గా కూడా అవసరంలో ఉన్నవారికి ప్రభాస్ సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేసినట్లు పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. పర్యావరణం విషయంలో కూడా ప్రభాస్ తన వంతు బాధ్యత తీసుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ ప్రాంతాన్ని దత్తత తీసుకుని దాని అభివృద్ధికి కోపరేట్ చేశారు. పచ్చదనం పెంచే కార్యక్రమాల్లోనూ భాగమయ్యారు.

ప్రభాస్ చేసే ప్రతి సాయం పెద్దగా ప్రచారంలోకి రావాలని ఆయన కోరుకోరనే పేరుంది. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన సహాయం బయటకు వచ్చిన తర్వాతే అభిమానులకు విషయం తెలుస్తుంది. అందుకే ప్రభాస్ అభిమానులు ఆయనను స్క్రీన్ పై మాత్రమే కాదు.. నిజ జీవితంలో కూడా బాహుబలిగా చూస్తుంటారు. నెట్ వర్త్ లిస్టులో పేరు ఉందా లేదా అనేది పక్కన పెడితే.. సంపాదనలో కొంత భాగాన్ని అవసరంలో ఉన్నవారికి ఇవ్వడం, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం కూడా ఒక వ్యక్తి వాల్యూను చూపిస్తుంది. అందుకే నెట్ వర్త్ లిస్టుల్లో పేరు లేకపోయినా.. మంచి పనులతో మాత్రం ప్రభాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.