Begin typing your search above and press return to search.

డార్లింగ్ బ‌ర్త్ డేకి క్లారిటీ ప్లాన్ చేస్తున్నారా?

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులు ప్రతీ ఏటా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

By:  Srikanth Kontham   |   15 Oct 2026 6:24 PM IST
డార్లింగ్ బ‌ర్త్ డేకి క్లారిటీ ప్లాన్ చేస్తున్నారా?
X

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులు ప్రతీ ఏటా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈసారి డార్లింగ్ బర్త్‌డే (అక్టోబర్ 23) మరింత స్పెషల్‌గా మారబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉండటంతో వాటి విడుదల తేదీలకు సంబంధించి ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ సినిమాలైన `స్పిరిట్`, `ఫౌజీ` చిత్రాల రిలీజ్ డేట్స్‌పై అక్టోబర్ 23న పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.

ప్రభాస్ న‌టిస్తోన్న‌ సినిమాల లైనప్ పై హైప్ ఏ రేంజ్ లో ఉందో? ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రా అండ్ రగ్గడ్ కాప్ యాక్షన్ డ్రామా `స్పిరిట్` చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా `ఫౌజీ` షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు చిత్రాలు ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయనే దానిపై గత కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొంది. షెడ్యూల్స్ మార్పులు, పోస్ట్-ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ సినిమాల విడుదల తేదీలపై ఎన్నో సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అభిమానుల్లో నెలకొన్న ఈ ఉత్కంఠకు తెరదించడానికి అక్టోబర్ 23వ తేదీని సరైన వేదికగా మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్స్‌తో పాటు.. కచ్చితమైన విడుదల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. అభిమానులకు ఇది నిజంగానే డబుల్ ధమాకా లాంటి ట్రీట్ అవుతుంది.

ఈ ప్రాజెక్టుల నిర్మాణ సంస్థలు కూడా ప్రభాస్ బర్త్‌డే పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పోస్టర్లు, టీజర్లు .. గ్లింప్స్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా `స్పిరిట్` సినిమాకు సంబంధించి ప్రభాస్ లుక్ లేదా మేకింగ్ వీడియోను రివీల్ చేయాలనే డిమాండ్ ఫ్యాన్స్ నుంచి బలంగా వినిపిస్తోంది. ఒకవైపు భారీ బడ్జెట్, మరోవైపు గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న ఈ సినిమాల రిలీజ్ డేట్స్ కనుక లాక్ అయితే ట్రేడ్ వర్గాల్లో కూడా స్పష్టత వచ్చేస్తుంది. ఈ అధికారిక ప్రకటన అభిమానులకు ఊరటనిస్తుంది.

మొత్తానికి అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే వేడుకలు కేవలం సెలబ్రేషన్స్‌కే పరిమితం కాకుండా రాబోయే పాన్-ఇండియా బాక్సాఫీస్ రికార్డులకు సంబంధించిన పక్కా రోడ్‌మ్యాప్‌ను అందించబోతున్నాయి. `స్పిరిట్`, `ఫౌజీ` చిత్రాల రిలీజ్ డేట్లపై రాబోయే అధికారిక ప్రకటన ఎన్నో సందేహాల‌కు పుల్ స్టాప్ పెడుతుంది.