ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్: బాక్సాఫీస్ రికార్డుల రారాజు!
ప్రభాస్ సినిమా వస్తోందంటే నిర్మాతలు, ట్రేడ్ వర్గాల్లో ఒకటే చర్చ. వందల కోట్ల పెట్టుబడులు పెట్టినా గ్యారెంటీ రిటర్నులు తేగల స్టార్‌డమ్ అతడి సొంతం అనే భరోసా ఉంది.
By: Sivaji Kontham | 23 Oct 2026 12:00 AM ISTభారతీయ సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్న మేటి కథానాయకుడు రెబల్ స్టార్ ప్రభాస్. గ్లామర్ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అజేయమైన కెరీర్‌ని కొనసాగిస్తూ బాక్సాఫీస్ రికార్డుల్లో రారాజు అని నిరూపించారు. కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా టాలీవుడ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రభాస్, బాక్సాఫీస్ నంబర్ గేమ్‌లో దేశంలోని ఏ ఇతర స్టార్ కంటే అత్యుత్తమంగా రాణిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అతడి సినిమా వస్తోందంటే థియేటర్లకు కదలడం ఒక ఫినామినాగా మారింది. మలి వయసులోనూ సినిమాలు చూడని పెద్దలు సైతం ప్రభాస్ చిత్రం కోసం థియేటర్లకు వస్తున్నారంటే.. అతడికి దేశ విదేశాల్లో ఉన్న యూనివర్సల్ యాక్సెప్టెన్సీ ఎలాంటిదో స్పష్టమవుతోంది.
పాన్ ఇండియా స్టార్‌డమ్‌ను దాటి గ్లోబల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ప్రభాస్, ప్రాంతీయ సినిమా హద్దులను చెరిపేసి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాహుబలి సిరీస్‌తో మొదలైన ఆయన జైత్రయాత్ర సాహో, సలార్, కల్కి 2898 ఏడీ వంటి చిత్రాలతో తిరుగులేని విజయాలను అందుకుంటోంది. 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించడం ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్‌కు కూడా నెరవేరని కల కాగా, ప్రభాస్ మాత్రం `బాహుబలి 2`, `కల్కి 2898 ఏడీ` చిత్రాలతో రెండు సార్లు వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి రికార్డ్ సృష్టించారు. `బాహుబలి 2` తొలి రోజే రూ. 200 కోట్ల వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మరించగా, `కల్కి 2898 ఏడీ`ఏకంగా రూ. 1100 కోట్ల గ్లోబల్ గ్రాస్‌ను రాబట్టి మరో సెన్సేషన్ సృష్టించింది.
ప్రభాస్ సినిమా వస్తోందంటే నిర్మాతలు, ట్రేడ్ వర్గాల్లో ఒకటే చర్చ. వందల కోట్ల పెట్టుబడులు పెట్టినా గ్యారెంటీ రిటర్నులు తేగల స్టార్‌డమ్ అతడి సొంతం అనే భరోసా ఉంది. యూఎస్, యూకే, జపాన్ వంటి ప్రతి దేశంలోనూ అతడి సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఓవర్సీస్ మార్కెట్‌లో 10 మిలియన్లకు పైగా వసూళ్లను సాధించిన తొలి హీరోగానూ ప్రభాస్ చరిత్ర సృష్టించారు. కేవలం కమర్షియల్ సినిమాల హవానే కాకుండా, స్క్రీన్ ప్రెజెన్స్‌లో `సలార్` వంటి చిత్రాల్లో అతడు చూపించిన మాస్ యాక్షన్... కల్కిలో వైవిధ్యమైన నటనతోను అతడు మనసులు గెలుచుకున్నాడు.
స్టార్‌గా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప వ్యక్తిత్వం ప్రభాస్ సొంతం. అజాతశత్రువు అనే పదానికి `డార్లింగ్` అనే కొత్త అర్థాన్నిచ్చిన ఆయన సమాజంలో ఏ విపత్తు సంభవించినా ముందుండి కోట్లాది రూపాయల విరాళాలు అందజేస్తూ తన మంచి మనసును చాటుకుంటారు. తనను ఇంతటి గ్లోబల్ స్టార్‌గా తీర్చిదిద్దిన అభిమానులంటే ఆయనకు ప్రాణం. అందుకే టెక్కలి నుంచి టోక్యో వరకు విస్తరించిన ఆయన సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభాస్‌ను తమ సొంత మనిషిలా ప్రేమిస్తారు. దర్శకుల విజన్‌ను నమ్మి వందల రోజులు కష్టపడే అతడి అంకితభావమే నేడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా నిలబెట్టింది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో `సలార్ 2`, సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్`, అలాగే హను రాఘవపూడితో `ఫౌజీ` వంటి భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టులతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ఈ భారీ చిత్రాలు త్వరలోనే బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. సలార్ 2, స్పిరిట్, ఫౌజీ చిత్రాలతో మరోసారి 1000 కోట్ల క్లబ్ రారాజుగా సంచలనాలు సృష్టించడం ఖాయమని అంతా భావిస్తున్నారు. అభిమానుల ప్రేమాభిమానాలతో మరెన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు చేయాలని కోరుకుంటూ..ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. (23 అక్టోబర్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ స్పెషల్ స్టోరి)
