పాన్ ఇండియా తీసేముందు తస్మాత్ జాగ్రత్త!
ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో కాకుండా రీజనల్ మార్కెట్ లో రిలీజ్ చేసి ఉంటే? ఫలితం మేకర్స్ అండ్ కో అనుకున్నట్లు ఉండేదేమో.
By: Srikanth Kontham | 26 Jan 2026 1:00 PM ISTకొంత మంది హీరోలు పాన్ ఇండియా సినిమాలంటూ ఎంతో ఆసక్తిగా కనిపిస్తున్నారు. కానీ కథల్ని మాత్రం కొంత మంది స్టార్లు కరెక్ట్ గా జడ్జ్ చేయలేకపోతున్నారన్నది కొంత నిజం. ఇందులో దర్శకుల వైఫల్యం హీరోలను మించి కనిపిస్తుంది? అన్నది అంతకు మించిన వాస్తవం. ఇటీవలే `ది రాజాసాబ్`, `అఖండ 2` అనే రెండు సినిమాలు పాన్ ఇండియాలో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ లో డిజాస్టర్ చిత్రాలుగా మిగిలాయి. రెండు భారీ అంచనాల మధ్యే రిలీజ్ అయ్యాయి. ప్రత్యేకించి రాజాసాబ్ విషయంలో ప్రభాస్ ఎంత కాన్పిడెంట్ గా లేకపోతే పాన్ ఇండియా రిలీజ్ పై అంత ధీమాగా ఉంటాడు.
ఈ విషయంలో మారుతి రిలీజ్ ముందు వరకూ కాస్త సైలెంట్ గాన ఉన్నా? సరిగ్గా ప్రీ రిలీజ్ లో ధాటిగా మాట్లాడే సరికి ఇంతకాలం పెదవి దాటని మాట ఆ రోజే దాటిందనుకున్నారంతా. టీమ్ లో కాన్పిడెన్స్ చూసి కొత్తగా ఏదో చేసారనే నమ్మకం ప్రేక్షకుల్లో మొదలైంది. కానీ రిలీజ్ తర్వాతే సీన్ మారిపోయింది. ప్రభాస్ ఇమేజ్ తో భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి గానీ బాక్సాఫీస్ వద్ద తేలి పోయింది. విమర్శల పరంగా చూస్తే ఇది ప్రభాస్ ఇమేజ్ కు తగ్గ స్టోరీ కాదని మెజార్టీ భాగం అభిప్రాయపడింది. ఇలాంటి సిల్లీ కథలో ప్రభాస్ నటించడం ఏంటి? ప్రభాస్ ఇమేజ్ ఏంటి? మారుతి తీసిన సినిమా ఏంటి? అని అసహనం వ్యక్తమైంది.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో కాకుండా రీజనల్ మార్కెట్ లో రిలీజ్ చేసి ఉంటే? ఫలితం మేకర్స్ అండ్ కో అనుకున్నట్లు ఉండేదేమో. ప్రభాస్ సరదాగా చేసిన ఓ ప్రయత్నంగా కనిపించేదేమో. అతడి పాన్ ఇండియా ఇమేజ్ ను పక్కనబెట్టి ప్రేక్షకులు ఆస్వాదించేవారేమో. నిడివి పరంగా రెండున్నర గంటల్లో పూర్తి చేయగల్గితే విమర్శలకు పెద్దగా ఆస్కారం ఉండేది కాదేమో అన్న సందేహాలు రిలీజ్ అనంతరం కొంత మంది నిపుణుల నుంచి వ్యకమయ్యాయి. అలాగే బాలయ్యతో బోయపాటి శ్రీను `అఖండ2`ను పాన్ ఇండియాలో రిలీజ్ చేసినా ఇండియా మాత్రం షేక్ అవ్వలేదు.
బాలయ్య ఇమేజ్ తో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ పాన్ ఇండియాకు ఈ సినిమా కనెక్ట్ అవ్వలేదు. అదే జరిగి ఉంటే ఈ సినిమా 300 కోట్లపైనే వసూళ్లు రాబట్టాలి. రొటీన్ యాక్షన్ చిత్రంగా తేలిపోయింది. హిందుత్వం కాన్సెప్ట్ తో బోయపాటి పాన్ ఇండియాకి కనెక్ట్ చేయాలనుకున్నారు. కానీ కంటెంట్ వీక్ గా ఉండటం సహా బాలయ్య పాత్రలో డోస్ ఓవర్ గానూ అనిపించింది. దీంతో పాన్ ఇండియాలో విమర్శలు తప్పలేదు. అదే ఈ చిత్రాన్ని రీజనల్ మార్కెట్ కి పరిమితం చేసి ఉంటే `అఖండ` తరహాలో బాక్సాఫీస్ ని షేక్ చేసేదే.
రీజనల్ మార్కెట్ లో సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వడంతో రకరకాల రివ్యూలు సినిమాపై ప్రభావాన్ని చూపించాయి. పాన్ ఇండియా సినిమాలు తీయాలనుకునే దర్శకులు పూర్తిగా థాట్ ప్రోసస్ మార్చాలి. కంటెంట్ యూనివర్శల్ గా ఉండాలి. పాయింట్ పాతదే అయినా ట్రీట్మెంట్ వినూత్నంగా ఉండాలి. పాన్ ఇండియా మార్కెట్ కు ఎంత వరకూ కనెక్ట్ అవుతుందో పూర్తి అవగాహన కలిగి ఉండాలి. స్టోరీ సహా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయగలగాలి. అలా చేయలేమంటే అనీల్ రావిపూడిలా రిజనల్ మార్కెట్లో సినిమాలు చేయాలి.
