Begin typing your search above and press return to search.

ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్లను నమ్మకపోవడానికి కారణం...

ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు కథలను సిద్ధం చేసుకుంటున్నారు.

By:  Gopi Velupala   |   15 Oct 2026 10:35 AM IST
ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్లను నమ్మకపోవడానికి కారణం...
X

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేసిన హీరోల్లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు. 'బాహుబలి' సినిమాతో స్టార్ డమ్ ను విస్తరించుకున్న ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తున్నాడు. కల్కి, సలార్ సినిమాలతో బిగ్గెస్ట్ సక్సెస్ లను అందుకున్నాడు. పాన్ ఇండియాలో ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసిన సౌత్ హీరో ప్రభాస్ కావడం విశేషం... ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి దర్శకుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన కమిటైన సినిమాలు పూర్తి అవ్వడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టే అవకాశమైతే ఉంది...

బాలీవుడ్ డైరెక్టర్లను పక్కన పెట్టాడా...

ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు కథలను సిద్ధం చేసుకుంటున్నారు. కొంతమంది ప్రభాస్ ని కలిసి వాళ్ళ కథను వినిపిస్తుంటే, మరి కొంతమంది ఆయన్ని కలవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాస్ అన్ని భాషల దర్శకులు చెప్పే కథలను వింటున్నప్పటికి బాలీవుడ్ డైరెక్టర్లు కథలు చెప్తానంటే మాత్రం ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఏంటంటే గతంలో ఓం రావత్ ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా చేస్తానని చెప్పి 'ఆది పురుషు' సినిమా చేశాడు. ఈ మూవీ భారీ డిజాస్టర్ గా మారడమే కాకుండా ప్రభాస్ తీవ్రమైన ట్రోల్స్ ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రభాస్ కి బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేనట్టుగా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. కానీ అలాంటిదేమీ లేదట. ఒక్క డైరెక్టర్ ప్లాప్ ఇచ్చినంత మాత్రాన ఇండస్ట్రీ మొత్తాన్ని పక్కన పెట్టలేం కదా... బాలీవుడ్ డైరెక్టర్లు చెప్పే కథల్లో కొత్తదనం ఉంటే ప్రభాస్ మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఈ క్రమంలోనే 'దురంధర్' మూవీతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆదిత్యధర్ ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ కథను రెడీ చేశాడట. అతను కథతో మెప్పిస్తే ప్రభాస్ పక్కగా అతనితో మూవీ చేసే అవకాశమైతే ఉంది...

ప్రభాస్ లైనప్

ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ, సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే నాగ్ అశ్విన్ తో 'కల్కి2' సినిమాలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పూర్తయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో 'సలార్ 2' సినిమా చేస్తాడు. ఇవన్నీ పూర్తయిన తర్వాత ప్రభాస్ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయాలనే దాని మీద ఫోకస్ చేస్తాడట. ఇప్పుడప్పుడే ఇవన్నీ పూర్తయ్యే అవకాశం లేదు కాబట్టి తనకి కథలు చెప్పడానికి దర్శకులు వచ్చినా కూడా వాటన్నింటిని హోల్డ్ లో పెడుతున్నాడట. ఫౌజీ, స్పిరిట్ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత అతను కొత్త సినిమాలకు కమిట్ అవుతాడట...