ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గ్రేట్!
ప్లాప్ ల్లో ఉన్న డైరెక్టర్లకు ఏ హీరో కూడా అవకాశం ఇవ్వడానికి ముందుకు రాడు. ఇస్తే తనతోనూ మరో ప్లాప్ సినిమా చేస్తాడేమోనన్న భయంతో సాహసం చేయలేరు.
By: Srikanth Kontham | 2 Jan 2026 3:33 PM ISTప్లాప్ ల్లో ఉన్న డైరెక్టర్లకు ఏ హీరో కూడా అవకాశం ఇవ్వడానికి ముందుకు రాడు. ఇస్తే తనతోనూ మరో ప్లాప్ సినిమా చేస్తాడేమోనన్న భయంతో సాహసం చేయలేరు. సూపర్ స్టార్ తో మహేష్ తో స్టార్ డైరెక్టర్ సినిమా చేయాలంటే అతడు వరుస హిట్లు అందించి ఉండాలి. ఆ ముందు సినిమా బ్లాక్ బస్టర్ అయి ఉండాలి. అప్పుడే మహేష్ తో ఛాన్స్ ఉంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ లతో ఛాన్స్ అందుకోవాలన్నా? హిట్ తప్పనిసరి. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటే పవన్ ఆ డైరెక్టర్ ని నమ్మితే చాలు. కళ్లు మూసుకుని ఛాన్స్ ఇస్తాడు.
డైరెక్టర్ల విషయంలో పవన్ రిస్క్ తీసుకోవడంలో ముందుంటారు. ఈనేపథ్యంలో యంగ్ డైరెక్టర్ సుజిత్ `ఓజీ`కి అవకాశం అందుకున్నాడు. `ఓజీ` కంటే ముందు సుజీత్ తెరకెక్కించిన `సాహో` ప్లాప్ అయింది. భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి గానీ అది హిట్ కాదు. కానీ మేకింగ్ పరంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా చూసే పవన్ `ఓజీ`కి అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్ సింగ్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. హరీష్ శంకర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ ఏది? అంటే `గబ్బర్ సింగ్` ఒక్కటే.
అదీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రమే. హరీష్ రెండవ సినిమా `మిరపకాయ్` బాగానే ఆడింది. `సుబ్రమణ్యం ఫర్ సేల్`, `దువ్వాడ జగన్నాధం` చిత్రాలు యావరేజ్ గా ఆడాయి. గత రెండు చిత్రాలు తీసుకుంటే `మిస్టర్ బచ్చన్`, `గద్దలకొండ గణేష్` ప్లాప్ అయినవే. దీంతో హీరీష్ శంకర్ కి ఏ స్టార్ హీరో చాన్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. అయినా ఆ పరాజయాలతో సంబంధం లేకుండా పవన్ `ఉస్తాద్ భగత్ సింగ్` తెరకెక్కించే అవకాశం ఇచ్చాడు. పవన్ నమ్మకానికి ఓ కారణం `గబ్బర్ సింగ్` అయితే? మరో కారణం అతడి ప్రతిభను నమ్మడం.
కొన్ని విషయాల్లో పవన్ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. ఆ డేరింగ్ కారణంగానూ హరీష్ శంకర్ కి మరో అవకాశం వచ్చిందన్నది కాదనలేని నిజం. ఇప్పుడా నమ్మకాన్ని హరీష్ అంతే నిలబెట్టుకోవాలి. ఈ సినిమాపై హరీష్ శంకర్ భవిష్యత్ కూడా ఆధారపడి ఉంది. ఈ సినిమా హిట్ అయితే స్టార్ లీగ్ లో కొనసాగడానికి, స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదంటే? మరో అవకాశం మరింత జఠిలమవుతుంది.
