రామాయణం పాత్రలో పూనమ్ పాండే.. మండిపడుతున్న హిందూ సంఘాలు
దేశవ్యాప్తంగా రేపటి నుంచి దుర్గాదేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఢిల్లీ రాంలీల మైదానంలో జరిగే రామ్ లీల నాటకంపైనే ఉంటుంది.
By: M Prashanth | 21 Sept 2025 12:30 PM ISTదేశవ్యాప్తంగా రేపటి నుంచి దుర్గాదేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఢిల్లీ రాంలీల మైదానంలో జరిగే రామ్ లీల నాటకంపైనే ఉంటుంది. పది రోజులపాటు జరిగే ఈ నాటకంలో రామాయణ ఇతిహాసాన్ని నాటకంగా ప్రదర్శిస్తారు. ఇందులో ఆయా పాత్రలను ఆయా నటీనటులు పోషిస్తారు. లవకుశ రామ్ లీల కమిటీ భారీ స్థాయిలో, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ నాటకాన్ని నిర్వహిస్తుంటారు.
ఈ నాటకం ఒక ప్రదర్శన మాత్రమే కాదు. ఇది భారతీయ సంప్రదాయాలు, విలువలును ప్రతిబింబిస్తుంది. ఇందులో ప్రతి పాత్ర కూడా అత్యంత కీలకమే. అయితే ఇందులో ఓ పాత్ర ఎంపికపై ప్రస్తుతం వివాదం నెలకొంది. నాటకంలో రావణుడి భార్య మండోదరి పాత్ర కోసం బాలీవుడ్ నటి పూనమ్ పాండేను కమిటీ ఎంపిక చేసింది. అయితే పూనమ్ ఎంపికపై ప్రస్తుతం వివాదం నడుస్తుంది.
ఈమె ఎంపికను బీజేపీ పార్టీ, విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, దీనిపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కమిటీని కోరుతున్నాయి. అయితే గతంలో పూనమ్ తన వీడియోలు, ఫొటోలు, తన పోస్ట్ లతో సోషల్ మీడియాలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేంది. ఆ మధ్య ఓసారి తాను మరణించినట్లు కూడా తమ టీమ్ తో స్పయంగా పుకార్లు పుట్టించింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆమెను మరొకరితో రీప్లేస్ చేయాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.
అయితే తమ నిర్ణయాన్ని కమిటీ సమర్థించుకుంది. మండోదరి పాత్రకు పూనమ్ ను ఎంపిక చేయడంలో ఎలాంటి తప్పు కనిపించడం లేదని చెప్పింది. ఆమె పాత్రకు మాత్రమే పరిమితం అని.. పూనమ్ డేరింగ్ ఉన్న నటి అని పేర్కొంది. అలాగే ఒక నటిగా అందరికీ అవకాశం అందుకునే అర్హత ఉంటుందని తెలిపింది. ఇక మండోదరి పాత్రకు రామాయణంలో చాలా స్కోప్ ఉంటుంది. ఆమె మంచి గుణాలున్న మహిళ. అంకితభావం, గౌరవంతో ఆదర్శంగా ఉంటుంది. మరి అలాంటి పాత్రను పూనమ్ ఎంత వరకు మ్యాచ్ చేస్తుందనేది ఆసక్తికరం.
ప్రస్తుతం పూనమ్ ఎంపికపై మాత్రం వివాదం రేగుతోంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. మరి నటకంలో పూనమ్ ఉంటుందా? లేదా ఆమెను ఇంకొక నటితో రిప్లేస్ చేస్తారా అన్న విషయం రేపటితో స్పష్టత రానుంది. కాగా, రావణుడి పాత్రకు ఆర్య బబ్బర్, హనుమంతుడిగా మల్హార్ పాండ్యా కనిపించనున్నారు
