మహాకాళి ఎదుట గ్యాంగ్‌స్టర్ రెహ్మాన్ డెకాయిత్
పాకిస్తాన్- లియారీ ప్రాంతంలోని కరుడుగట్టిన ప్రమాదకర గ్యాంగ్ స్టర్ గా రెహ్మాన్ డెకాయిత్ కి పేరుంది.
By: Sivaji Kontham | 2 Jan 2026 9:44 AM ISTపాకిస్తాన్- లియారీ ప్రాంతంలోని కరుడుగట్టిన ప్రమాదకర గ్యాంగ్ స్టర్ గా రెహ్మాన్ డెకాయిత్ కి పేరుంది. అతడు తన శత్రువుతో కలిసి పని చేస్తోందనే ఆరోపణలతో తన సొంత తల్లినే హతమార్చాడని కథనాలొచ్చాయి. అంతేకాదు తన తండ్రిని కూడా రోడ్ పై హింసించి అత్యంత పాశవికంగా హతమార్చిన భయానక చరిత్ర అతడిది. క్రూరత్వంలో అతడు పరాకాష్ఠ. అదే సమయంలో అతడు లియారీ స్లమ్స్ లో చాలా మంది ప్రజలకు ఆరాధ్యుడు. అతడు పేదలకు సహాయం చేసాడు. వారిని ఆదుకున్నాడు. అందుకే అతడు నాయకుడు కూడా అయ్యాడు.
అయితే ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నట ప్రదర్శనకు ఇండియాతో పాటు పాకిస్తాన్ లోను వీరాభిమానులు ఏర్పడ్డారు. 2025లో అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకుని పైరసీలో వీక్షించిన మూవీగాను పాకిస్తాన్ లో దురంధర్ రికార్డులు సృష్టించడం వెనక రెహ్మాన్ డెకాయిత్ పాత్ర కారణమని విశ్లేషించారు.
అయితే ఒకే ఒక్క పాత్రతో ఇంతటి ప్రభావం చూపించిన అక్షయ్ ఖన్నాకు ఇప్పుడు ఆఫర్లు వెంటపడుతున్నాయి. అతడి ఇంటికే నేరుగా సూట్ కేసులు వెళుతున్నాయి. అలా టాలీవుడ్ నుంచి కూడా అతడు ఆఫర్ అందుకున్నాడు. దర్శకురాలు పూజా కొల్లూరు రూపొందిస్తున్న మహాకాళి` సినిమాలో అతడు నటిస్తున్నాడు. ఇది అతడికి తెలుగులో ఆరంగేట్ర చిత్రం. తాజాగా సెట్స్ నుండి నటుడు అక్షయ్ ఖన్నాతో కలిసి దిగిన ఒక సెల్ఫీని దర్శకురాలు పూజా షేర్ చేసారు. పూజా కొల్లూరుతో పాటు తన ట్రేడ్‌మార్క్ చిరునవ్వుతో ఖన్నా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అక్షయ్ తో కలిసి పని చేసే అవకాశం దక్కినందుకు ఈ అవకాశం కల్పించిన 2025 ఏడాదికి పూజా ధన్యవాదాలు తెలిపారు. అతడి పరిచయంతో తన భావోద్వేగాన్ని పూజా సోషల్ మీడియాల్లో షేర్ చేసారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'మహాకాళి'లో భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోంది. అక్షయ్ ఖన్నా పాత్ర ఏమిటన్నది ఇంకా రివీల్ కావాల్సి ఉంది. అతడు ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్షయ్ ఖన్నా దివంగత వెటరన్ నటుడు వినోద్ ఖన్నా కుమారుడు అన్న సంగతి తెలిసిందే.
రణ్ వీర్ నటించిన దురంధర్ చిత్రం 1200కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సీక్వెల్ 19 మార్చి 2026న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.
