Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ ఫోక‌స్ మొత్తం దానిపైనే!

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో మొద‌ట్లో నిలిచిన పూజా హెగ్డే ఇప్పుడు కొత్త ప్లాన్ తో తిరిగి రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   13 Feb 2026 8:00 PM IST
బుట్ట‌బొమ్మ ఫోక‌స్ మొత్తం దానిపైనే!
X

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో మొద‌ట్లో నిలిచిన పూజా హెగ్డే ఇప్పుడు కొత్త ప్లాన్ తో తిరిగి రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. వరుస స‌క్సెస్‌ల‌తో స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ బ్యూటీ, ఆ తర్వాత ఎదురైన వరుస పరాజయాలతో కొంత వెనుక‌బ‌డ్డారు. అయితే త‌న కెరీర్‌లో వచ్చిన ఈ మలుపును ఒక బ్రేక్ లాగా కాకుండా పూజా దాన్నొక‌ రీసెట్ బటన్‌గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

రెమ్యూనరేష‌న్ కార‌ణంగా అవ‌కాశాలు రాలేద‌ని ప్ర‌చారం

టాలీవుడ్‌లో ఒక దశలో అత్యంత బిజీ హీరోయిన్‌గా కొనసాగిన పూజా హెగ్డే, భారీ పారితోషికం కారణంగా కూడా కొన్ని ప్రాజెక్టులు చేజార్చుకుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపించింది. నిర్మాతలు ఖర్చులను కట్టడి చేయాలనుకున్న సమయంలో ఆమె రెమ్యునరేషన్ అడ్డంకిగా మారిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అదే సమయంలో పూజా హీరోయిన్ గా న‌టించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ పరిణామాలతో పూజాకు టాలీవుడ్‌లో గ్యాప్ ఏర్పడింది.

తెలుగుపై దృష్టి పెట్టిన పూజా

అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూనే మంచి బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, పూజా హెగ్డే దృష్టి మళ్లీ తెలుగుపైనే ఉందని సమాచారం. టాలీవుడ్‌లో తాను సంపాదించిన స్టార్‌డమ్, అభిమానుల ఆదరణ ఆమెకు ప్రత్యేకమని భావిస్తున్నపూజా, మళ్లీ ఇక్కడ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కంబ్యాక్ విష‌యంలో సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు

రీసెంట్ గా పూజాని రెండు తెలుగు సినిమాల‌ కోసం సంప్రదించినట్టు స‌మాచారం. అయితే ఈసారి రెమ్యూన‌రేష‌న్ విషయంలో కూడా సర్దుబాటు చేసేందుకు అమ్మ‌డు సిద్ధంగా ఉందన్న వార్త ఇండస్ట్రీ వర్గాల్లో డిస్క‌ష‌న్ పాయింట్ అయింది. ఇది ఆమె కంబ్యాక్‌పై ఉన్న సీరియస్‌నెస్‌ను స్పష్టంగా చూపిస్తోంది. కథ, పాత్ర ప్రాధాన్యం, బ్యానర్ విశ్వసనీయత లాంటి అంశాలను పూజా ప్రాధాన్యంగా తీసుకుంటున్నార‌ని అంటున్నారు.

ఇన్‌సైడ్ టాక్ ప్ర‌కారం ఫిబ్రవరిలోనే పూజా నెక్ట్స్ తెలుగు ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని.. సరైన కథ, సరైన హీరోతో మళ్లీ టాలీవుడ్‌లో తన ముద్ర వేసేందుకు పూజా హెగ్డే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కెరీర్‌లో వచ్చిన ఒడిదుడుకులు స్టార్‌డమ్‌ను తగ్గించవ‌ని, ఆ ఒడిదుడ‌కుల‌ను ఎదుర్కొని మ‌రోసారి టాలీవుడ్ లో పూజా స్టార్ గా ఎదుగుతారా లేదా అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.