టైమ్ బ్యాడ్ అంటే ఇదే.. అగ్రనాయిక స్ట్రగుల్!
కొన్ని వరుస పరాజయాలతో విసిగిపోయింది పూజా హెగ్డే, రెట్రో, దేవా, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, బీస్ట్, రాధేశ్యామ్ ఇవన్నీ కెరీర్ లో డిజాస్టర్ కా బాప్ అనుభవాన్ని మిగిల్చాయి.
By: Sivaji Kontham | 18 Aug 2025 8:00 AM ISTకొన్ని వరుస పరాజయాలతో విసిగిపోయింది పూజా హెగ్డే, రెట్రో, దేవా, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, బీస్ట్, రాధేశ్యామ్ ఇవన్నీ కెరీర్ లో డిజాస్టర్ కా బాప్ అనుభవాన్ని మిగిల్చాయి. అయినా పూజా హెగ్డేకు అవకాశాలు పరంగా కొదవేమీ లేదు. అగ్ర హీరోలు ఇప్పటికీ వెంటపడుతూనే ఉన్నారు.
కనీసం ఇటీవల రిలీజైన `కూలీ` అయినా హిట్టు టాక్ తెచ్చుకుందా? అంటే నెగెటివ్ టాక్ నిరాశపరిచింది. రజనీ మానియా ముందు ఇతరులు ఎవరూ కనిపించలేదనే టాక్ వచ్చింది. ఇందులో పూజా హెగ్డే వేడెక్కించే ఐటమ్ పాటలో కనిపించినా కానీ, దాని గురించి పెద్దగా చర్చించుకోలేదు. అనిరుధ్ రొటీన్ చెత్త మ్యూజిక్ ఈ పాటకు పెద్ద మైనస్. మాస్ బీట్ విసిగించింది. పూజా హెగ్డే మోనికా బెల్లూసీ లాంటి హాలీవుడ్ సౌందర్యరాశిని ఇమ్మిటేట్ చేసిన తీరు బావున్నా, పాటలో గజిబిజి లిరిక్, పస లేని బీట్ నీరసం తెప్పించాయి.
మొత్తానికి ఒక పెద్ద సూపర్‌స్టార్ సినిమా మొదటిరోజు నుంచి మిక్స్ డ్ రివ్యూలతో రన్ అవుతోంది. ఇది పూజాకు పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయినప్పుడు దాని చుట్టూ, చాలా అవకాశాలు కూడా క్రియేట్ అవుతాయి. అలాంటి పరిస్థితులు పూజా హెగ్డేకు ఐదారేళ్లుగా లేనే లేవు.
అయినా సక్సెస్ తో సంబంధం లేకుండా పూజా వరుసగా పెద్ద హీరోల సరసన అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో దళపతి విజయ్ తో `జననాయగన్` అనే భారీ చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తో ఓ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు పూజాను ఆదుకోవాల్సి ఉంది. జన నాయగన్ త్వరలో విడుదల కానుండగా, నితిన్ తో సినిమా గురించి ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి.
ఏ నటి అయినా సుదీర్ఘ కాలం ఫ్లాపుల భారాన్ని మోయడం కుదరదు. ఏదో ఒక సమయంలో ఇది దెబ్బ కొడుతుంది. పూజా ప్రస్తుతం కెరీర్ లో `అల వైకుంఠపురములో` లాంటి పెద్ద హిట్టు కోసం ప్రయత్నిస్తోంది. అది మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న దళపతి అందిస్తాడని కూడా ఆశిస్తోంది. మరోవైపు రాబిన్ హుడ్, తమ్ముడు లాంటి ఫ్లాపుల్లో నటించిన నితిన్ కి ఇది పాథ్ బ్రేకింగ్ మూవీ కావాల్సి ఉంది.
