Begin typing your search above and press return to search.

అహంకారం కాదు.. అసలు కారణం చెప్పిన పూజా హెగ్డే!

సినీ సెల‌బ్రిటీలు అభిమానుల ప్రేమతోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంటారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   13 Jun 2026 9:00 PM IST
అహంకారం కాదు.. అసలు కారణం చెప్పిన పూజా హెగ్డే!
X

సినీ సెల‌బ్రిటీలు అభిమానుల ప్రేమతోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు బహిరంగ కార్యక్రమాల్లో లేదా ప్రయాణాల సమయంలో అభిమానులను పలకరించకుండా వెళ్లిపోతే సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా అలాంటి చర్చల మధ్య స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

రీసెంట్ గా పూజా ఓ సందర్భంలో అభిమానిని దాటుకుని వెళ్లిపోయిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై కొందరు నెటిజన్లు పూజా హెగ్డే ప్రవర్తనపై విమర్శలు గుప్పించగా, మరికొందరు పరిస్థితులను అర్థం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పూజా స్వయంగా స్పందిస్తూ తన వైఖరిపై స్పష్టత ఇచ్చింది. సినీ పరిశ్రమలో అభిమానులే తమకు జీవం పోసే శక్తి అని పూజా హెగ్డే పేర్కొంది. ఒక నటుడు లేదా నటికి ప్రేక్షకుల మద్దతు లేకపోతే స్టార్‌డమ్‌కు విలువ ఉండదని ఆమె అభిప్రాయపడింది. అభిమానుల ప్రేమ, ఆదరణ వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పిన ఆమె, వారిని ఎప్పటికీ తక్కువగా చూడబోమని స్పష్టం చేసింది.

అయితే ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా పలకరించడం సాధ్యం కాదని పూజా వివరించింది. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులు ఉండొచ్చు, మరికొన్ని సందర్భాల్లో భారీ జనసందోహం కారణంగా అందరినీ గుర్తించి రియాక్ట్ అవ‌డం కష్టమవుతుందని చెప్పింది. అలాంటి సందర్భాల్లో అభిమానులను పట్టించుకోకుండా వెళ్లిపోయినట్లు కనిపించినా, దానిని అహంకారంగా భావించకూడదని ఆమె కోరింది. అభిమానులు త‌మ‌కు దేవుళ్లతో సమాన‌మ‌ని, వారి వల్లే మేము ఈ స్థాయికి చేరుకున్నామ‌ని, కానీ ప్రతి క్షణం అందరికీ రియాక్ట్ అవ‌లేక‌పోవ‌చ్చ‌ని, అందుకే సెల‌బ్రిటీల‌ను తప్పుగా అర్థం చేసుకోవద్ద‌ని పూజా హెగ్డే చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.

సెలబ్రిటీల లైఫ్ లో ఇలాంటి పరిస్థితులు కొత్తవి కావు. ఎయిర్‌పోర్ట్స్, ఈవెంట్స్, షూటింగ్ లొకేషన్ల వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడం సాధారణమే. భద్రతా కారణాలు, సమయాభావం లేదా నిర్వాహకుల నియమాల కారణంగా కొన్నిసార్లు సెలబ్రిటీలు ఫ్యాన్స్ తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయ‌లేరు. అయితే అలాంటి చిన్న సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి వ్యక్తిత్వంపై అనవసరమైన అభిప్రాయాలు ఏర్పడే అవకాశమూ ఉంటుంది.

ఈ నేపథ్యంలో పూజా హెగ్డే చేసిన కామెంట్స్ అభిమానులు, సెలబ్రిటీల మధ్య ఉన్న బాండింగ్ ను మరోసారి గుర్తు చేశాయి. అభిమానుల ప్రేమకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని, కొన్నిసార్లు కనిపించే ప్రవర్తన వెనుక వాస్తవ పరిస్థితులు కూడా ఉంటాయని ఆమె ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు చాలామందిని ఆలోచింపజేస్తోంది. అభిమానులను గౌరవించడం తమ బాధ్యతేనని, అదే సమయంలో కొన్ని సందర్భాల్లో పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలని పూజా హెగ్డే చేసిన విజ్ఞప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.