Begin typing your search above and press return to search.

విజయ్ విక్టరీ.. పూజ ముందే గెస్ చేసినట్లు ఉందే..

తమిళనాడులో స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

By:  M Prashanth   |   5 May 2026 7:19 PM IST
విజయ్ విక్టరీ.. పూజ ముందే గెస్ చేసినట్లు ఉందే..
X

తమిళనాడులో స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు. ఈ నేపథ్యంలో అనేక మంది సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో విజయ్‌ కు విషెస్ తెలియజేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా అవే పోస్టులు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా తన ప్రత్యేక శైలిలో రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికే విజయ్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆమె, తాజాగా ఒక క్యూట్ వీడియోను ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. షేర్ చేసిన వీడియో వివరాల్లోకి వెళితే.. ఇది విజయ్, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న జన నాయగన్ సినిమా షూటింగ్ సమయంలో తీసినదిగా తెలుస్తోంది.

షూటింగ్ గ్యాప్‌ లో సరదాగా తీసుకున్న ఆ వీడియోలో ఒక క్వశ్చన్ బోర్డు కనిపిస్తుంది. అందులో 'ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారు?' అనే ప్రశ్న ఉంటుంది. అప్పుడు పూజా హెగ్డే సరదాగా విజయ్ వైపు చూపిస్తూ 'విజయ్' అని చెప్పడం కనిపిస్తుంది. ఈ సందర్భంలో విజయ్ నవ్వుతూ కనిపించడం వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆ వీడియోను షేర్ చేస్తూ పూజ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చారు.

'విజయ్ సార్ సీఎం అవుతారని నేను అప్పుడే ఊహించాను. మీ కలలు నిజం కావాలి సర్' అంటూ ఆమె పేర్కొన్నారు. దీంతో అభిమానులు ఆ వీడియోను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. పూజా హెగ్డే అప్పుడే విజయ్ గెలుపును గెస్ చేశారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పూజా హెగ్డే తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా వ్యక్తం చేశారు.

'ఓ మై గాడ్.. విజయ్ సార్ కంగ్రాట్స్. దళపతి కచేరి ఇంకా పెద్దదిగా మారుతోంది. ముందుకు దూసుకెళ్తోంది. పార్టీ టైమ్.. లెట్స్ గో' అంటూ విజయ్‌ తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఆ పోస్ట్ కూడా అప్పట్లో వైరల్ అయింది. మొత్తానికి, విజయ్ పొలిటికల్ కెరీర్ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో పార్టీ స్థాపించి, సింగిల్‌ గా పోటీ చేసి విజయం సాధించడం విశేషం. ఇది సాధారణ విషయం కాదని అంతా అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక పెద్ద మార్పుకు నాంది కావొచ్చని చెబుతున్నారు. అయితే విజయ్ ముఖ్యమంత్రి కావడంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతున్నప్పటికీ, సినిమాల్లో ఆయనను ఇకపై చూడలేమనే కొంత నిరాశ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. విజయ్ చివర మూవీగా పూజా హెగ్డేతో కలిసి నటిస్తున్న జన నాయగన్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అభిమానులు ఆ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మొత్తంగా చూస్తే, విజయ్ విజయం, పూజా హెగ్డే షేర్ చేసిన వీడియో.. ఆ రెండూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి.