నిండా ప్రేమలో మునిగిన బుట్టబొమ్మ.. ఎవరా మిస్టరీ మ్యాన్?
కెరీర్ ప్రారంభం నుండి వివాదాలకు, గాసిప్‌లకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ భామపై ఇప్పటివరకు పెద్దగా ప్రేమ వార్తలు రాలేదు. కానీ తాజాగా పూజా హెగ్డే ఒక యువ నటుడితో ప్రేమలో మునిగి తేలుతోందని వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
By: Sivaji Kontham | 29 April 2026 11:47 PM ISTబాలీవుడ్ తెరపై కథానాయికల డేటింగ్ రూమర్లు వినిపించడం చాలా సాధారణమైన విషయం. దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ నుండి అనన్యా పాండే వరకు దాదాపు అందరిపైనా కెరీర్ ఆరంభం నుండి ఏదో ఒక గాసిప్ షికారు చేస్తూనే ఉంది. అయితే ఈ విషయంలో మన `బుట్టబొమ్మ` పూజా హెగ్డే చాలా భిన్నం. కెరీర్ ప్రారంభం నుండి వివాదాలకు, గాసిప్‌లకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ భామపై ఇప్పటివరకు పెద్దగా ప్రేమ వార్తలు రాలేదు. కానీ తాజాగా పూజా హెగ్డే ఒక యువ నటుడితో ప్రేమలో మునిగి తేలుతోందని వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
పూజా హెగ్డే మనసు దోచుకున్న ఆ లక్కీ ఫెలో మరెవరో కాదు.. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రా. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతోందని.. ఒకరికొకరు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పుకుంటూ హింట్స్ ఇస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. పూజా ప్రస్తుతం తన సినిమాలైన `జన నాయగన్` (తమిళం), `హై జవానీ తో ఇష్క్ హోనా హై` (హిందీ) షూటింగ్స్‌లో బిజీగా ఉన్నా.. రోహన్ మెహ్రాతో తరచుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరాలకు చిక్కడంతో ఈ రూమర్లు నిజమేనని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
ఇంతకీ ఎవరీ రోహన్ మెహ్రా? ఈయన నేపథ్యం ఏంటని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోహన్ మెహ్రా మరెవరో కాదు.. బాలీవుడ్ లెజెండరీ నటుడు దివంగత వినోద్ మెహ్రా కుమారుడు. వినోద్ మెహ్రా మరణించినప్పుడు రోహన్ చిన్న పిల్లాడు కావడంతో తన తండ్రి స్టార్‌డమ్‌ను ఆయన చూడలేకపోయారు. కెన్యాలో పెరిగిన రోహన్.. ఆ తర్వాత లండన్‌లో చదువుకుని.. నటనపై ఆసక్తితో ముంబైకి తిరిగి వచ్చారు. ఈయన సోదరి సోనియా మెహ్రా కూడా నటిగా బాలీవుడ్‌కు సుపరిచితురాలే.
నటుడిగా రోహన్ ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. సంజయ్ లీలా భన్సాలీ వద్ద `బాజీరావ్ మస్తానీ` సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రోహన్ 2018లో సైఫ్ అలీ ఖాన్ సరసన `బజార్` చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ హీరో అవార్డును కూడా అందుకున్నారు. కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యతనిచ్చే రోహన్ `420 ఐపిసి`, `కాల` వంటి వెబ్ సిరీస్‌లతో ఓటీటీ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
అయితే రోహన్ వ్యక్తిగత జీవితంలో ఇది మొదటి ప్రేమ వార్తేమీ కాదు. పూజా హెగ్డే కంటే ముందు అతడు నటి తారా సుతారియాతో సుదీర్ఘకాలం డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. తారా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు పూజాతో అతడు సన్నిహితంగా ఉంటున్న తీరు చూస్తుంటే.. త్వరలోనే వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన కెరీర్ లో రూమర్లకు చోటివ్వని పూజా ఇప్పుడు రోహన్‌తో సీరియస్ గా రిలేషన్‌లో ఉండటం చూసి అభిమానులు షాక్‌కి గురవుతున్నారు. పూజా హెగ్డే నటించిన జననాయగన్ కొంతకాలంగా రిలీజ్ డైలమాలో ఉన్న సంగతి తెలిసిందే. మే 8న విడుదలవుతుందని ఇటీవల కథనాలొస్తున్నాయి.
