Begin typing your search above and press return to search.

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

విల‌క్ష‌ణ ప్రకాష్ రాజ్- కొరియోగ్రాఫర్ పోనీ వర్మల ప్రేమ వివాహం గురించి బాలీవుడ్‌లో ప్రత్యేక చర్చ నడుస్తూనే ఉంటుంది.

By:  Srikanth Kontham   |   3 Nov 2026 12:00 AM IST
ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!
X

విల‌క్ష‌ణ ప్రకాష్ రాజ్- కొరియోగ్రాఫర్ పోనీ వర్మల ప్రేమ వివాహం గురించి బాలీవుడ్‌లో ప్రత్యేక చర్చ నడుస్తూనే ఉంటుంది. విభిన్న సాంస్కృతిక నేపథ్యాలు.. వయసులో తేడా వంటి కారణాల రీత్యా ఇద్ద‌రి పెళ్లి సమయంలో పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వివాహానికి ముందు పోనీ వర్మ కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పిన ఓ సరదా హెచ్చరిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణ భారతదేశ సంస్కృతి, ఆహారపు అలవాట్ల గురించి సరైన అవగాహన లేని కారణంగా పోనీ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందడం గమనార్హం.

ఈ విషయాలపై పోనీ వర్మ ఓ ఇంటర్వ్యూలో నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ప్రకాష్‌రాజ్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో త‌న స్నేహితులు, కుటుంబ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారని తెలిపారు. `దక్షిణాది వంటకాల గురించి వారికి ఎలాంటి అవగాహన లేదు. నువ్వు పెళ్లి చేసుకుంటే ప్రతిరోజూ సాంబార్ మాత్రమే తినాల్సి వస్తుంది. చివరికి నువ్వు చచ్చిపోతావు అని భయపెట్టారు. హోటళ్లలో ఎప్పుడో ఒకసారి ఇడ్లీ సాంబార్ తింటే బాగుంటుంది కానీ రోజూ అదేంటి అని హెచ్చరించారు. అయితే నాకు సాంబార్ అంటే ఇష్టమని చెప్పాను` అంటూ ఆనాటి సరదా సంభాషణలను పంచుకున్నారు.

అలాగే ఇద్ద‌రి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం - సాంస్కృతిక భేదాల గురించి కూడా పోనీ వ‌ర్మ‌ స్పందించారు. తనకంటే 12 ఏళ్లు పెద్దవారైన ప్రకాష్‌రాజ్‌ను పెళ్లి చేసుకోవడంపై పెద్దఎత్తున చర్చ జరిగిందని, బంధువులు కూడా పలు సందేహాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అయితే ఆ వయసు వ్యత్యాసమే తమ కాపురానికి పెద్ద బలమ యిందని నమ్ముతున్నారు. తన జీవితంలో ఎదురైన కష్ట సమయాల్లో ప్రకాష్‌రాజ్ చూపిన పరిణతి, ప్రశాంతత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.

వ్యక్తిగత జీవితంలో ఇద్దరూ విభిన్న పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో వీరి పరిచయం ఏర్పడింది. పోనీ వర్మ తల్లి మృతితో తీవ్ర మనోవేదనలో ఉండగా.. ప్రకాష్‌రాజ్ మొదటి భార్య లలితా కుమారితో విడాకుల తర్వాత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆ సమయమే ఇద్దరిని మానసికంగా దగ్గర చేసింది. పోనీ అల్లరి స్వభావాన్ని, ఆందోళనలను ప్రకాష్‌రాజ్ ఎంతో ఓపికతో అర్థం చేసుకున్నారని.. నిలకడైన జీవితాన్ని అందించారని కొనియాడారు.

జీవితంలో హడావిడిగా ప‌రిగెత్తే మనస్తత్వాన్ని ప్రకాష్‌రాజ్ పూర్తిగా మార్చేశారని పోనీ తెలిపారు. భోజనం చేసేటప్పుడు కూడా పద్ధతులు పక్కన పెట్టి హాయిగా చేత్తో తింటూ ప్రశాంతంగా జీవించడం ఎలాగో ప్ర‌కాష్‌ నేర్పించారన్నారు. జీవిత అనుభవం ఉన్న వ్యక్తి అయితేనే తన ఆలోచనలను, భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోగలరని ఆ విషయంలో ప్రకాష్‌రాజ్ తగిన జోడీ అని అభిప్రాయపడ్డారు.