Begin typing your search above and press return to search.

ప్రకాష్ రాజ్ కెరీర్‌పై భార్య సంచలన వ్యాఖ్యలు!

ప్రకాష్ రాజ్ తీసుకునే రాజకీయ నిర్ణయాల వల్ల నిర్మాతలు వెనకడుగు వేసిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు.

By:  Srikanth Kontham   |   1 Nov 2026 11:18 AM IST
ప్రకాష్ రాజ్ కెరీర్‌పై భార్య  సంచలన వ్యాఖ్యలు!
X

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన చూపిన ప్రతిభే పాన్-ఇండియా స్థాయిలో నిలబెట్టింది. అయితే సినిమాల విషయానికొస్తే ఎలాంటి ప్రశంసలు అందుకుంటారో? దేశంలో జరిగే సామాజిక, రాజకీయ పరిణామాలపై స్పందించే తీరు కారణంగా అంతే స్థాయిలో వివాదాలను కూడా ఎదుర్కొంటుంటారు. మనసులోని మాటను నిర్భయంగా మాట్లాడే ప్రకాష్ రాజ్ రాజకీయ అభిప్రాయాల వల్ల వృత్తిపరంగా ఎంతో నష్టపోయారని.. పలు సినిమాలు.. వాణిజ్య ప్రకటనలను కోల్పోవాల్సి వచ్చిందని ప్ర‌కాష్ రాజ్ సతీమణి, కొరియోగ్రాఫర్ పోనీ వర్మ తాజాగా వెల్లడించారు.

సమాజంలో జరిగే అన్యాయాలపై, ప్రభుత్వ విధానాలపై ప్రకాష్ రాజ్ ఎప్పుడూ ముందుండి గళం వినిపి స్తుంటారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గౌరీ లంకేష్ హత్య తర్వాత ఆయన మరింత ధైర్యంగా తన గొంతును వినిపించడం మొదలుపెట్టారని పోనీ వర్మ గుర్తు చేసుకున్నారు. ఆ ఘటన ఆయన్ని మానసికంగా ఎంతో కుంగదీసినా? నిశ్శబ్దంగా ఉండకుండా నిజం మాట్లాడాలని నిర్ణయించు కున్నారని తెలిపారు. అయితే ఈ నిర్భయ స్వభావమే ఆయన ప్రొఫెషనల్ లైఫ్‌పై తీవ్ర ప్రభావం చూపిందని.. ఎన్నో అవకాశాలు చేజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకాష్ రాజ్ తీసుకునే రాజకీయ నిర్ణయాల వల్ల నిర్మాతలు వెనకడుగు వేసిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. అడ్వాన్స్‌లు ఇచ్చినా? కొందరు నిర్మాతలు ప్రాజెక్ట్‌ల నుంచి తొలగించారని, అనేక యాడ్ డీల్స్ కూడా రద్దయ్యాయని వెల్లడించారు. ఇండస్ట్రీలో ప్రకాష్ కు రావాల్సిన ఎన్నో అవకాశాలు కేవలం రాజకీయ కారణాల వల్లే చేజారిపోయాయని.. దీనివల్ల ఆయన ఆర్థికంగా, వృత్తిపరంగా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అయినా? తన అంతరాత్మ ఏది చెప్తుందో దానినే నమ్ముతారని.. తప్పు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండలేనని ప్రకాష్ రాజ్ భావిస్తారని పేర్కొన్నారు.

ఇలాంటి సున్నితమైన అంశాలపై ప్రకాష్ రాజ్ రోడ్డెక్కి నిరసనలు తెలిపిన సందర్భాల్లో కుటుంబ సభ్యులుగా తాము కూడా ఎంతో ఆందోళన చెందామని పోనీ వర్మ తెలిపారు. ఢిల్లీలో జరిగిన కొన్ని నిరసన కార్యక్రమాలు, లాఠీచార్జీలు చూసినప్పుడు భయమేసిందని కానీ భర్త మాత్రం ప్రజల కోసం, విద్యార్థుల తల్లిదండ్రుల కోసం నిలబడతానని చెప్పి వెనకడుగు వేయలేదని గుర్తు చేసుకున్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి తాను చేసే పోరాటంలో భాగంగానే ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ప్ర‌కాష్ భావిస్తుంటారని పేర్కొన్నారు.

వ్యక్తిగతంగా ఎన్నో నష్టాలు ఎదురైనా? తన సిద్ధాంతాల నుంచి ప్రకాష్ రాజ్ ఎప్పుడూ వెనక్కి తగ్గేది లేదని సతీమణి స్పష్టం చేశారు. ఏ నటుడైనా కెరీర్‌ను కాపాడుకోవడానికి వివాదాలకు దూరంగా ఉండాలని చూస్తాడు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ప్రజల గొంతుకగా నిలవడానికే ప్రాధాన్యత ఇస్తారన్నారు. సినిమాల పరంగా ఆయన ఎంత బిజీగా ఉన్నా? సామాజిక బాధ్యతగా భావించి ఇలాంటి అంశాలపై స్పందించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు.