సూపర్‌స్టార్‌ని ఢీకొడుతున్న అభిమాని సినిమా!
2026 సంక్రాంతి సందర్భంగా అగ్ర హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 5 Jan 2026 9:16 AM IST2026 సంక్రాంతి సందర్భంగా అగ్ర హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్లు ప్రభాస్, చిరంజీవి సంక్రాంతి బరిలో ఉన్నారు. వీళ్లకు పోటీగా కోలీవుడ్ నుంచి ఇద్దరు హీరోలు బరిలో దిగుతున్నారు. దళపతి విజయ్ నటించిన జననాయగన్, శివ కార్తికేయన్ నటించిన పరాశక్తి చిత్రాలు పోటాపోటీగా విడుదలకు రానున్నాయి.
ఇటీవల ఈ అంశం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యంత హాట్ టాపిక్. శివకార్తికేయన్ తన సినిమా `పరాశక్తి` ని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం `జన నాయకన్`తో పోటీపడి మంచి రాబడిని రాబట్టాల్సి ఉంది.
క్లాష్‌పై శివకార్తికేయన్ స్పందించారు. శివకార్తికేయన్ మొదటి నుంచీ దళపతి విజయ్‌కి పెద్ద అభిమాని. తన సినిమా విజయ్ సినిమాతో పోటీ పడటం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. `జన నాయకన్` విడుదల తేదీ అధికారికంగా ప్రకటించినప్పుడు శివకార్తికేయన్ నిజంగా `షాక్` కు గురయ్యారని సమాచారం. విజయ్ సార్ సినిమాతో క్లాష్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు అని ఆయన తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది.
విడుదల తేదీని మార్చే ప్రయత్నం చేసారు. శివకార్తికేయన్ స్వయంగా తన నిర్మాతలను కలిసి `పరాశక్తి` విడుదల తేదీని మార్చమని కోరారు. విజయ్ సినిమా సోలోగా రావాలని, తద్వారా ఆయన కెరీర్ చివరి సినిమాకు సరైన గౌరవం ఇచ్చినట్లు ఉంటుందని ఆయన భావించారు. అయితే సంక్రాంతి (పొంగల్) సీజన్ కావడంతో థియేటర్ల ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయని, అందుకే తేదీని మార్చడం సాధ్యం కాదని నిర్మాతలు తేల్చి చెప్పారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో తమిళనాడులో జననాయకన్ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు 80శాతం థియేటర్లు ఈ సినిమాకే కేటాయించారు.
అమరన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో శివకార్తికేయన్ మార్కెట్ కూడా పెరిగింది. కానీ, విజయ్ క్రేజ్ ముందు నిలబడటం కొంచెం కష్టమే అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు విజయ్ మాత్రం ఈ క్లాష్ గురించి చాలా కూల్‌గా ఉన్నారని సమాచారం. సంక్రాంతికి అందరి సినిమాలు ఆడాలని, యువ హీరోల సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధించాలని ఆయన కోరుకుంటున్నట్లు సమాచారం.
