Begin typing your search above and press return to search.

ముప్పెట దాడి అయినా త‌గ్గ‌ని ద‌ళ‌పతి!

కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో తిరుగులేని స్టార్‌గా పేరు తెచ్చుకున్న ద‌ళ‌ప‌తి విజ‌య్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాక ఒంట‌రివాడ‌య్యారు.

By:  Ravindar Gorantla   |   4 March 2026 5:42 PM IST
ముప్పెట దాడి అయినా త‌గ్గ‌ని ద‌ళ‌పతి!
X

రాజ‌కీయాల్లోకి సినిమా స్టార్లు వ‌స్తున్నారంటే రాష్ట్ర పార్టీ నాయ‌కుల‌తో పాటు జాతీయ పార్టీల‌కు ఓ ద‌డ మొద‌ల‌వుతుంది. ఆదిలోనే వారిని రాజ‌కీయ‌ల్లోకి రాకుండా చేయాల‌ని, సూటిపోటి మాట‌ల‌తో చిత్ర హింస‌ల‌కు గురి చేసి నాకొద్దు బాబోయ్ ఈ రాజ‌కీయాలు అనే స్థాయికి తీసుకురావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేయ‌డం వంటి సంఘ‌ట‌న‌లు ఎన్నో చూశాం. వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి తొంగి చూస్తూ ఏదైనా బ‌ల‌హీన‌త ఉందా? అని గ‌మ‌నించి దానిపై దాడిచేస్తూ మాట‌ల యుద్ధం చేయ‌డం, రాజ‌కీయాల్లోకి రావాల‌నుకున్న వారి మాన‌సిక స్థైర్యాన్ని దెబ్బ‌తీయ‌డం గ‌త ఎన్నో ఏళ్లుగా జ‌రుగుతూనే ఉంది.

ఎంజీఆర్‌..జ‌య‌ల‌లితల‌కే త‌ప్ప‌లేదు.

నాటి స్వ‌ర్గీయ ఎంజీఆర్, జ‌య‌ల‌లిత‌, ఎన్టీఆర్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ర‌జ‌నీకాంత్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర‌కు రాజ‌కీయ అరంగేట్రం కోసం, రాజ‌కీయాల్లో నిల‌బ‌డ‌టం కోసం యుద్ధ‌మే చేయాల్సి వ‌చ్చింది. 1953లో త‌మిళ రాజ‌కీయాల్లో ఎంజీఆర్ పెను సంచ‌ల‌నం సృష్టించారు. డీఎంకే పార్టీతో స‌రికొత్త చ‌ర్చ‌కు తెర‌లేపారు. అయితే ఆ త‌రువాత జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల కార‌ణంగా 1972లో ఏఐఏడీఎంకే పేరుతో సొంత పార్టీని మొద‌లు పెట్టి త‌మిళ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్నే స‌మూలంగా మార్చివేశారు.

1977లో ముఖ్య‌మంత్రి అయ్యారు. దేశ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు. అంత వ‌ర‌కు ఎంజీఆర్ ఎదుర్కొన్న అవ‌మానాలు, చీత్కారాలు, వ్య‌క్తిగ‌త దాడులు ఎన్నో.. అవ‌న్నింటినీ త‌ట్టుకుని త‌మిళ రాజ‌కీయాల‌లో ఎంజీఆర్ విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొచ్చారు. ఎంజీఆర్ త‌రువాత జ‌య‌ల‌లిత ఎలాంటి అవ‌మానాల్ని ఎదుర్కొందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ముఖ్య‌మంత్రిగా ప‌దివిని చేప‌ట్టిన త‌రువాత జ‌య‌ల‌లిత రాజ‌కీయ ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం తెలిసిందే. వీరి త‌రువాత 1982లో తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించి ఎనిమిది నెల్లోనే ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించి చ‌రిత్ర సృష్టించారు.

చిరు ర‌జ‌నీ వెన‌క‌డుగు..

ఎన్టీఆర్ త‌రువాత ఆయ‌న స్ఫూర్తితో రాజ‌కీయాల్లోకి రావాల‌ని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌య‌త్నించ‌డం తెలిసిందే. ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించి గ్రామ స్వ‌రాజ్యం తెస్తామ‌ని రంగంలోకి దిగారు. అయితే ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బెంబేలెత్తిపోయి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తో దాడికి దిగ‌డం, ఫ్యామిలీని టార్గెట్ చేయ‌డం వంటి కార‌ణాల‌తో చిరు పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయ‌డం.. ఆ త‌రువాత క్ర‌మ క్ర‌మంగా రాజకీయాల నుంచి త‌ప్పుకోవ‌డం తెలిసిందే. త‌మిళ‌నాట ర‌జ‌నీ కూడా రాజ‌కీయాల్లోకి రావాలని ప్ర‌య‌త్నాలు చేసి వ్య‌క్త‌గ‌త విమ‌ర్శ‌లు ఎదుర్కోలేక పార్టీ పెట్ట‌కుండానే రాజ‌కీయాల‌కు దూరమ‌య్యారు. సినిమాల‌కే ప‌రిమితం అయ్యారు.

చ‌రిత్ర సృష్టించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌..

చిరు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు త‌లొగ్గి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. జ‌న‌సేన పార్టీని స్థాపించి తొలిసారి కంటెస్ట్ చేసిన ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మిని చ‌వి చూశారు. ఆ త‌రువాత పుంజుకుని 21 స్థానాల్లో పోటీ చేసి వంద శాతం స్ట్రైక్ రేటుతో 21 స్థానాల్లో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసి చ‌రిత్ర సృష్టించారు. ఏపీ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పారు. డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు వీరంద‌ని స్ఫూర్తితో త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తున్న ద‌ళ‌ప‌తి విజ‌య్ ముప్పెట దాడిని ఎదుర్కొంటున్నాడు. పార్టీ ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి అత‌ని చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. పార్టీ జెండాపై ఇప్ప‌టికీ కోర్టులో కేసు న‌డుస్తోంది.

అంతే కాకుండా క‌రూర్ బహిరంగ స‌భ తొక్కీస‌లాట‌కు సంబంధించి ఇప్ప‌టికే విజ‌య్ రెండు సార్లు సీబీఐ ముందు హాజ‌రై త‌న వాద‌న వినిపించి వ‌చ్చారు. అయినా స‌రే అత‌న్ని వివాదాలు ఒక్కొక్క‌టిగా చుట్టుముడుతూనే ఉన్నాయి. రాజ‌కీయ అరంగేట్రం నేప‌థ్యంలో చేసిన చివ‌రి సినిమా `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్ వాయిదా ప‌డి సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. భార్య సంగీత 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ డిసెంబ‌ర్‌లో చెంగ‌ల్ ప‌ట్టు ఫ్యామిలీ కోర్టులో పిటీష‌న్ వేయ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఇదే సంద‌ర్భంగా బీజేపీ అధ్య‌క్షుడు త్రిష‌తో విజ‌య్ రిలేష‌న్‌లో ఉన్నాడ‌ని, త‌న ఇంటిని వీడి బ‌య‌టికి రావాల‌ని చేసిన వ్యాఖ్య‌లు త‌మిళ‌నాట ప్ర‌కంప‌ణ‌లు సృష్టించాయి.

దాడి ఎంత తీవ్ర‌మైనా త‌గ్గేదే లే!

కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో తిరుగులేని స్టార్‌గా పేరు తెచ్చుకున్న ద‌ళ‌ప‌తి విజ‌య్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాక ఒంట‌రివాడ‌య్యారు. ఆయ‌న బార్య విడాకులు కోర‌డం, అధికార పార్టీతో పాటు జాతీయ పార్టీలు కూడా ఇబ్బందుల‌కు గురి చేస్తుండ‌టంతో విజ‌య్‌పై ముప్పెడ దాడి జ‌రుగుతోంది. అయినా స‌రే విజ‌య్ త‌గ్గేదేలే అంటూ వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. హేమా హేమీలు రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి రాజ‌కీయాల‌కు దూర‌మైన నేప‌థ్యంలో విజ‌య్ ఇలా త‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని ప‌ణంగా పెట్టి ఏది జ‌రిగినా యుద్ద‌మే కానీ వెన‌క్కు త‌గ్గేది లేద‌ని చెబుతుండ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. బుధ‌వారం తంజావూరు జిల్లాలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో విజ‌య్ భావోద్వేగానికి లోనై ఎవ‌రు ఎలాంటి అడ్డంకులు సృష్టించినా త‌మిళ‌నాడులో విజిల్ వేస్తామ‌ని, డిల్లీ టీమ్ (బీజేపీ) స‌హా అన్ని జ‌ట్ల‌ని టీవీకే ఓడిస్తుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.