Begin typing your search above and press return to search.

పవన్ పై మరో స్టాండప్ కమెడియన్ కామెంట్స్.. కట్ చేస్తే..

తాజాగా వైజాగ్ కు చెందిన కమెడియన్ రఫీక్ మొహమ్మద్‌ ను మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఈ అంశంపై మరింత చర్చకు దారితీసింది.

By:  M Prashanth   |   18 April 2026 3:04 PM IST
పవన్ పై మరో స్టాండప్ కమెడియన్ కామెంట్స్.. కట్ చేస్తే..
X

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై స్టాండప్ కామెడీ పేరుతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కమెడియన్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా వైజాగ్ కు చెందిన కమెడియన్ రఫీక్ మొహమ్మద్‌ ను మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఈ అంశంపై మరింత చర్చకు దారితీసింది. అనంతరం రఫీక్ బెయిల్‌ పై విడుదలయ్యాడు.

బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన రఫీక్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపాడు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులపై కొందరు స్టాండప్ కమెడియన్లు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఆ వ్యాఖ్యలు జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ముఖ్యంగా కమెడియన్ అనుదీప్ కటికాల చేసిన కామెంట్లు పెద్ద వివాదానికి దారితీశాయి.

పవన్ కళ్యాణ్‌ తో పాటు నిహారిక, ఉపాసన, రామ్ చరణ్, వంటి ప్రముఖులపై అనుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన కాకినాడ పోలీసులు అనుదీప్‌ ను ఉత్తరప్రదేశ్‌ లో అరెస్ట్ చేశారు. ఆ కేసు కొనసాగుతుండగానే, రఫీక్ మొహమ్మద్‌ కు సంబంధించిన పాత వీడియోలు బయటకు రావడంతో వివాదం మరింత ముదిరింది.

ఆ వీడియోల్లో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై రఫీక్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని జనసేన నేత సాయన శివనారాయణ ఆరోపించారు. దీంతో మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు నమోదు అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రాత్రి విశాఖపట్నంలో ఉన్న రఫీక్ నివాసానికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరిపిన తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది.

బెయిల్‌ పై విడుదలైన రఫీక్ మొహమ్మద్ మీడియాతో మాట్లాడుతూ తన తప్పును ఒప్పుకున్నాడు. "పవన్ గారి గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తప్పే. నేను అలా చేయకూడదు. ఆయన, ఆయన అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకు క్షమాపణలు కోరుతున్నాను" అని తెలిపాడు. స్టాండప్ కామెడీ ప్రదర్శనలో భాగంగా ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆ వ్యాఖ్యలు చేశానని, అయితే వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరైంది కాదని అంగీకరించాడు.

ఇకపై ఎవరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయనని, తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని రఫీక్ స్పష్టం చేశాడు. ఈ సంఘటన దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగినదని, ఇప్పుడు బయటకు వచ్చి వివాదానికి కారణమైందని చెప్పాడు. కేసు నమోదైన తర్వాత చట్టపరంగా సహకరిస్తానని తెలిపాడు. మరోవైపు, ఈ ఘటనల నేపథ్యంలో సోషల్ మీడియాలో కామెడీ పేరుతో వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అన్న చర్చ మళ్లీ ప్రారంభమైంది. లిమిట్స్ పాటించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా ఇలాంటి కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.