Begin typing your search above and press return to search.

'పాకెట్ రాకెట్స్' సాంగ్.. అమ్మాయి మాయలో పడితే అంతే..

డిసెంబర్ 11న విడుదల కానున్న ‘పాకెట్ రాకెట్స్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అప్సర’ విడుదలైంది. రుద్ర అత్రి దర్శకత్వంలో త్రినాథ్ వర్మ, శ్రియ కొంతం జంటగా నటిస్తున్నారు. జ్ఞాని స్వరపరిచి పాడిన ఈ పాట క్యాచీ రిథమ్‌తో ఆకట్టుకుంటోంది. కలర్‌ఫుల్ విజువల్స్‌లో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

By:  M Prashanth   |   25 Nov 2026 9:34 AM IST
పాకెట్ రాకెట్స్ సాంగ్.. అమ్మాయి మాయలో పడితే అంతే..
X

డిసెంబర్ 11న థియేటర్లలోకి రాబోతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'పాకెట్ రాకెట్స్' నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. రుద్ర అత్రి రచన, దర్శకత్వంలో త్రినాథ్ వర్మ, నిర్మల్, శ్రియ కొంతం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ 'అప్సర' లేటెస్ట్ గా విడుదలైంది. లవ్ సాంగ్స్ అంటే ఎప్పుడూ ఒకేలాంటి సీరియస్ మెలోడీలే కాకుండా, కాస్త చిలిపితనం కలిపి ఈ పాటను తీసుకొచ్చారు.

అమ్మాయిని మొదటిసారి చూసినప్పటి నుంచి ఆమె ఆలోచనల్లోనే మునిగిపోయిన ఒక కుర్రాడి పరిస్థితిని ఇందులో సరదాగా చూపించారు. ప్రేమలో పడ్డాక తన మీద తనకే కంట్రోల్ తప్పిందని, ఆమె వేసిన ఆటలో తానే పావుగా మారిపోయానని హీరో చెప్పుకునే తీరు యూత్ కి బాగా రిలేట్ అవుతుంది. రమేష్ కుమార్ వాకచర్ల రాసిన లిరిక్స్ మరీ భారంగా కాకుండా, నేటి జనరేషన్ ట్రెండ్ కు తగ్గట్టు సింపుల్ గా కుదిరాయి.

ఈ పాటకు జ్ఞాని సంగీతం అందించడమే కాకుండా స్వయంగా పాడారు. హెవీ బీట్స్ జోలికి వెళ్లకుండా, వినగానే నచ్చే ఒక లైవ్లీ రిథమ్ తో ట్యూన్ సెట్ చేశారు. పాటలోని సరదా మూడ్ కు తగ్గట్టు జ్ఞాని వోకల్స్ ఎనర్జిటిక్ గా సాగాయి. మొదటిసారి విన్నప్పుడే హమ్ చేసుకునేలా క్యాచీగా ఉండటం ఈ పాటకు కలిసొచ్చే అంశం. నార్మల్ లిరికల్ వీడియోలంటే కేవలం సినిమా స్టిల్స్ తో సరిపెట్టేస్తుంటారు. కానీ 'అప్సర' కోసం కలర్ ఫుల్ గ్రాఫిక్స్ తో క్రియేటివ్ గా డిజైన్ చేశారు.

పాటలోని రొమాంటిక్ థీమ్ కు తగ్గట్టు విజువల్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. స్క్రీన్ మీద త్రినాథ్ వర్మ, శ్రియ కొంతం మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరీటి దామరాజు లాంటి నోటెడ్ ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమమ్ సిటీ స్టూడియోస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

వార్నర్ మ్యూజిక్ గ్రూప్ అనుబంధ సంస్థ డివో మ్యూజిక్ ద్వారా ఈ పాట ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇయర్ ఎండ్ సీజన్ కావడంతో డిసెంబర్ నెలలో చాలా సినిమాలు క్యూ కట్టాయి. ఇలాంటి టైమ్ లో కొత్త నటీనటులతో వచ్చే సినిమాలకు పాటలు, టీజర్ల ద్వారా వచ్చే బజ్ చాలా ముఖ్యం. ఫస్ట్ సింగిల్ 'అప్సర' తో 'పాకెట్ రాకెట్స్' టీమ్ యూత్ ను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. డిసెంబర్ 11 రిలీజ్ లోపు రాబోయే టీజర్, ట్రైలర్ కూడా ఇదే స్థాయిలో క్లిక్ అయితే థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ దక్కే ఛాన్స్ ఉంది.