Begin typing your search above and press return to search.

మోదీ ఇంట్రెస్ట్.. అఖండ 2కి బంపరాఫర్

ఈ విషయాన్ని ఎవరో బయటవాళ్ళు చెప్పలేదు, స్వయంగా దర్శకుడు బోయపాటి శ్రీను గారే రివీల్ చేశారు.

By:  M Prashanth   |   14 Dec 2025 10:04 PM IST
మోదీ ఇంట్రెస్ట్.. అఖండ 2కి బంపరాఫర్
X

సినిమా సక్సెస్ అంటే కేవలం కలెక్షన్లు మాత్రమే కాదు, అది ఎంతమందిని ప్రభావితం చేసింది, ఎవరి దాకా వెళ్ళింది అనేది కూడా చాలా ముఖ్యం. నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' సినిమా ఇప్పుడు సరిగ్గా ఇదే చేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రికార్డుల వేట కొనసాగుతుండగానే, ఢిల్లీ స్థాయి నుంచి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు వీక్షించే అవకాశం ఉందని తెలియడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ విషయాన్ని ఎవరో బయటవాళ్ళు చెప్పలేదు, స్వయంగా దర్శకుడు బోయపాటి శ్రీను గారే రివీల్ చేశారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ గారి కోసం ఢిల్లీలో ఒక స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీ గారు ఇప్పటికే ఈ సినిమా గురించి విన్నారని, చూడటానికి ఆసక్తిగా ఉన్నారని బోయపాటి చెప్పడం విశేషం. త్వరలోనే దీనికి సంబంధించిన డేట్, పూర్తి వివరాలు ప్రకటిస్తారట.

అసలు ప్రధాని ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం ఇందులోని కాన్సెప్ట్. 'అఖండ 2' కేవలం ఫ్యాక్షన్ సినిమానో, యాక్షన్ సినిమానో కాదు. ఇది సనాతన ధర్మం, దేశభక్తి అనే అంశాల చుట్టూ తిరిగే కథ. దేశం మీద బయో వార్ జరిగితే, దాన్ని అడ్డుకుని ప్రజల్లో దైవభక్తిని, నమ్మకాన్ని అఖండ ఎలా కాపాడాడు అనే పాయింట్ మీదే సినిమా నడుస్తుంది. ప్రస్తుత కాలంలో ఇలాంటి దేశ భక్తి, ధార్మిక అంశాలు ఉన్న సినిమాలకు మంచి గుర్తింపు లభిస్తోంది.

శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అఖండ మొదటి భాగం ఇచ్చిన హైప్, ఇప్పుడు సీక్వెల్ మీద ఉన్న అంచనాల వల్ల థియేటర్ల దగ్గర సందడి గట్టిగానే ఉంది. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా సినిమా చూస్తే, ఈ సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం. కలెక్షన్లకు మించి ఒక గౌరవం దక్కినట్లు అవుతుంది.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి కారణం కూడా ఇదే. తెలుగుతో పాటు నార్త్ లో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేశారు. హిందీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే డివోషనల్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అక్కడ ప్రమోషన్స్ కూడా ముందే చేశారు. ఇప్పుడు మోదీ గారి స్క్రీనింగ్ వార్తతో నార్త్ బెల్ట్ లో కూడా సినిమాకు మరింత పబ్లిసిటీ వచ్చే అవకాశం ఉంది.