Begin typing your search above and press return to search.

ఈ గాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి సోద‌రి

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఆమెకు నివాళులు అర్పించారు.

By:  Sivaji Kontham   |   29 Sept 2025 1:37 AM IST
ఈ గాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి సోద‌రి
X

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఆమెకు నివాళులు అర్పించారు. ఆదివారం నాటి `మన్ కీ బాత్` 126వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ ''ఈరోజు లతా మంగేష్కర్ జయంతి... ఆమె పాటల్లో భావోద్వేగాలను రేకెత్తించే టోన్ ఉంటుంది. ల‌తాజీ పాడిన దేశభక్తి గీతాలు ప్రజలను ప్రేరేపించాయి. ఆమెకు భారతీయ సంస్కృతితో లోతైన సంబంధం ఉంది'' అని అన్నారు. మరాఠీ సుగం సంగీత్‌లో గొప్ప వ్యక్తి అయిన సుధీర్ ఫడ్కే దీదీని నాకు మొదట పరిచయం చేశారు. ఆమె పాడిన సుధీర్ ఫడ్కే జీ స్వరపరిచిన జ్యోతి కలశ్ చల్కే పాట నాకు చాలా ఇష్టమని దీదీకి చెప్పాను.. అని అన్నారు.

లతా మంగేష్కర్‌తో సోద‌ర బంధం గురించి మోదీ గుర్తు చేసుకున్నారు. లతా దీదీతో నాకున్న అనురాగ బంధం ఎల్లప్పుడూ చెక్కుచెదరకుండా ఉంది. ఆమె ప్రతి సంవత్సరం తప్పకుండా నాకు రాఖీ పంపేది.. అని అన్నారు. లతా దీదీని స్ఫూర్తిగా తీసుకున్న గొప్ప వ్యక్తులలో వీర్ సావర్కర్ ఒకరు. ఆమె తాతయ్యా అని పిలిచేవారు. వీర్ సావర్కర్ పాటలను ఆమె తన స్వరంలో పాడారు అని అన్నారు.

భారతదేశపు గాన‌కోకిల‌గా లతా మంగేష్కర్ సుప్ర‌సిద్ధులు. భారతీయ సంగీత ప‌రిశ్ర‌మ ఎప్ప‌టికీ మ‌రువ‌ని పేరు ఇది. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సంగీత ప్రియులు, అభిమానులు కూడా దీదీ జన్మదినోత్సవం సందర్భంగా సంస్మ‌రించుకున్నారు. ఏడు దశాబ్దాలుగా 36 కి పైగా భాషలలో 30,000 కి పైగా పాటలను ల‌తాజీ ఆల‌పించారు.

లతా మంగేష్కర్ 6 ఫిబ్రవరి 2022న 92 సంవత్సరాల వయసులో మ‌ల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మ‌ర‌ణించారు. ఆమె మరణం తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముంబైలో మంగేష్కర్ కుటుంబాన్ని ఆమె సోదరి ఆశా భోంస్లేను సందర్శించి దిగ్గజ గాయనికి నివాళులర్పించారు.