ప్లాస్టిక్ చెత్తను కాల్చి రూఫ్ టైల్స్‌గా మార్చారు.. ఆశ్చర్యకరంగా ఇంట్లో వేడి 17°C వేడి తగ్గింది!
అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ ప్రయోగం ఇటు నిర్మాణ రంగంలోనూ.. అటు పర్యావరణ పరిరక్షణలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
By: Sivaji Kontham | 28 Sept 2026 11:00 PM ISTఇది చెత్త.. అంటూ పారేసే ప్లాస్టిక్ సంచులను ఉపయోగకరమైన ఇంటి నిర్మాణ సామగ్రిగా మార్చడానికి పరిశోధకులు ఒక వినూత్నమైన మార్గాన్ని అన్వేషించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి రూఫ్ టైల్స్‌గా మలచడం ద్వారా పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా.. భవనాలలోని ఉష్ణోగ్రతలను కూడా తగ్గించవచ్చని ఈ అధ్యయనం నిరూపించింది. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ ప్రయోగం ఇటు నిర్మాణ రంగంలోనూ.. అటు పర్యావరణ పరిరక్షణలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ప్రయోగంలో భాగంగా పరిశోధకులు వ్యర్థ ప్లాస్టిక్ లేదా పాలిథీన్ సంచులను సేకరించి వాటిని ఒక ప్రత్యేక బాయిలర్‌లో సుమారు 200°C (సెంటీగ్రేడ్) నుండి 250°C వరకు వేడి చేసి పూర్తిగా కరిగించారు. ఆ ద్రవ రూపంలో ఉన్న ప్లాస్టిక్‌ను తగిన అచ్చులలో పోసి గట్టిగా కుదించి సుమారు 24 గంటల పాటు చల్లార్చడం ద్వారా 12x12 అంగుళాల చదరపు సైజులో రూఫ్ టైల్స్‌ను తయారు చేశారు. ఇలా తయారైన 1.5 అంగుళాల మందం కలిగిన ప్లాస్టిక్ టైల్స్‌ను ప్రామాణిక కాంక్రీట్ స్లాబ్‌లతో పోల్చి ప్రయోగశాలలో పరీక్షించారు.
ప్రయోగశాలలో నిర్వహించిన థర్మల్ పరీక్షలలో ఈ ప్లాస్టిక్ టైల్స్ అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఒక వంద వాట్ల ఇన్‌ఫ్రారెడ్ బల్బుతో వేడి చేసినప్పుడు 1.5 అంగుళాల ప్లాస్టిక్ టైల్ గరిష్టంగా 43°C ఉష్ణోగ్రతను మాత్రమే చేరుకుంది. ఇది సాధారణ రీన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ కంట్రోల్ స్లాబ్ కంటే దాదాపు 17°C తక్కువగా ఉండటం విశేషం. అలాగే 0.5 అంగుళాల పలుచని టైల్ కూడా కాంక్రీట్ కంటే సుమారు 16°C తక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేసింది.
సాధారణ కాంక్రీట్ లేదా సిమెంట్ బ్లాకులతో పోలిస్తే ఈ ప్లాస్టిక్ టైల్స్ బరువులో చాలా తక్కువగా ఉండటమే కాకుండా.. ఉష్ణ వాహకతను కూడా చాలా తక్కువగా ప్రదర్శించాయి. వేడి - చల్లదనం మార్పుల ప్రక్రియలో ఈ టైల్స్‌పై ఎటువంటి పగుళ్లు లేదా రంగు మారడం వంటి సమస్యలు తలెత్తలేదు. ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై గతంలో (2018లో) జరిగిన ఇతర పరిశోధనలు కూడా ఇలాంటి అనుకూల ఫలితాలనే వెల్లడించాయి.
అయితే ఈ ప్రయోగాలన్నీ పూర్తిగా నియంత్రిత ప్రయోగశాల వాతావరణంలోనే జరిగాయి కాబట్టి సహజమైన ఎండ, వాన, చలి వంటి వాతావరణ పరిస్థితులను ఇవి దీర్ఘకాలం ఎలా తట్టుకుంటాయనే దానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్లాస్టిక్ కరిగించే ప్రక్రియకు ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం కావడం.. తయారీ విధానాన్ని మరింత మెరుగుపరచడం వంటి సవాళ్లు ఇంకా ఉన్నాయి. అయితే ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపుతూ మంచి ఉష్ణోగ్రత నిరోధకతను అందించే ప్రత్యామ్నాయ నిర్మాణ సామాగ్రిగా ఇది తొలి అడుగుగా చెప్పవచ్చు. అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎల్.నినో ప్రమాదం నుంచి కొంతవరకూ ఉపశమనాన్ని ఇచ్చే టైల్స్ ని పాలిథీన్ కవర్లు లేదా ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేయాలనే ఆలోచన ఉత్తమమైనదే.. కానీ ఇది ఇంకా ప్రయోగాత్మక దశలో ఉంది.
