Begin typing your search above and press return to search.

'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌'తో పోలికా.. ఇది మ‌రీ కామెడీ!

‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’తో ‘రివెంజ్ ఆఫ్ నాగదేవతాస్’ను పోలుస్తూ ఓ సినీ ప్రముఖుడు చేసిన సెటైరికల్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని తక్కువ చేయడం సరికాదని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సాంకేతిక ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటే ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని అభిప్రాయపడుతున్నారు.

By:  Sivaji Kontham   |   24 Nov 2026 11:51 PM IST
ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌తో పోలికా.. ఇది మ‌రీ కామెడీ!
X

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక సినీ ప్రముఖుడి వివాదాస్పద-సెటైరికల్ వ్యాఖ్యలు.. దానికి నెటిజన్ల నుంచి వస్తున్న కౌంటర్లు తెగ వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ చిత్రం `ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్` పేరుతో సినిమా తీస్తే ప్రేక్షకులు ఎగబడి చూస్తారు కానీ, అదే మన నేటివిటీతో `రివెంజ్ ఆఫ్ నాగదేవతాస్` అంటే చూడరా? అంటూ సదరు వ్యక్తి ప్ర‌శ్నించ‌డం చ‌ర్చ‌గా మారింది. అంతేకాదు, ``నువ్వు ఎన్ని షర్ట్స్ మార్చినా పగ మాత్రం మారదు.. కాటేస్తా!`` అనే డైలాగ్‌ సినిమాలో పెడితే 100 రోజులు ఆడుతుందంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, సినీ అభిమానులు తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. హాలీవుడ్ సినిమాల పేర్లతో పోలుస్తూ తెలుగు ప్రేక్షకుల అభిరుచిని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. స్క్రీన్‌ప్లే ఆకట్టుకునేలా కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఏ సినిమానైనా ఆదరిస్తారని.. వారికి ఏ సినిమాపైనా వ్యక్తిగత కక్ష ఉండదని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు.

పాత చింతకాయ పచ్చడి లాంటి కథలతో.. ప్రేక్షకులను త‌గ్గించి చూస్తూ సినిమాలు తీయడం వల్లే ఆదరణ తగ్గుతోందని విశ్లేషిస్తున్నారు. సినిమా హిట్ అయితే `ప్రేక్షక దేవుళ్లు` అని పొగడటం.. అదే సినిమా ఆడకపోతే ప్రేక్షకుల అభిరుచిని తప్పుబట్టడం సినీ వర్గాల్లో కొందరికి అలవాటుగా మారిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ చిత్రాన్ని ఒక అద్భుత‌మైన స్క్రీన్ ప్లే, భారీత‌నం నిండిన ప్ర‌యోగాత్మ‌క స్క్రిప్టుతో హాలీవుడ్ లో తెర‌కెక్కించారు. ఆ సినిమా క‌థ, క‌థ‌నం, న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌, రీరికార్డింగ్, విజువ‌ల్ సెన్స్, లాజిక్స్ ఇలా అన్ని కోణాల్లో అంత‌ర్జాతీయ స్టాండార్డ్స్ ని ప్ర‌తిబింబించింది. అందుకే ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క‌వ‌ర్షం కురిపించింది. అలా కాకుండా త‌లా తోకా లేని క‌థ‌నాల‌తో రూపొందించే లోక‌ల్ సినిమాల‌కు ప్ర‌జాద‌ర‌ణ కావాల‌ని అడిగితే ఎలా ఉంటుంది. సినిమా పిచ్చితో ఏదో ఒక నాశిర‌కం సినిమా తీసేస్తే దానిని చూడ‌టానికి ఇప్పుడు ఎవ‌రూ సిద్ధంగా లేరు. ప్ర‌మాణాలు పెద్ద స్థాయిలో ఉంటేనే ఆద‌రిస్తున్నారు! రివెంజ్ ఆఫ్ ది నాగ‌దేవ‌తాస్.. క‌థ‌, క‌థ‌నం, ఆర్.ఆర్ స్టాండార్డ్స్.. ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం ఇవ‌న్నీ ఆ రేంజులో ఉంటేనే వ‌ర్క‌వుట్ అవుతుంది.