పిఠాపురంలో అలా మొదలైంది.. మళ్లీ ఫ్యామిలీ కథతో మహేష్ చంద్ర
ప్రేయసి రావే సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ చంద్ర ఇప్పుడు మరో ఫ్యామిలీ కథతో వస్తున్నారు.
By: M Prashanth | 8 Sept 2026 12:57 PM ISTప్రేయసి రావే సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ చంద్ర ఇప్పుడు మరో ఫ్యామిలీ కథతో వస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన పిఠాపురంలో అలా మొదలైంది సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. టైటిల్ నుంచే కథకు పిఠాపురం నేపథ్యం ఉందని అర్థమవుతోంది. ప్రేమ, కుటుంబం, సరదా సన్నివేశాలతో పాటు తండ్రి, కూతురు మధ్య అనుబంధం ఈ కథలో ముఖ్యంగా ఉండబోతోంది.
రాజేంద్ర ప్రసాద్ ఇందులో కీలక పాత్రలో నటించారు. పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మతో పాటు సన్నీ అఖిల్, విరాట్, జూనియర్ పవన్ కల్యాణ్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఒక కుటుంబంలో మనకు రోజూ ఎదురయ్యే మనుషులు, పరిస్థితులకు దగ్గరగా పాత్రలను రాసినట్టు దర్శకుడు చెబుతున్నారు. ఇప్పటి యువతకు చెప్పాల్సిన ఒక విషయాన్ని కూడా కథలో భాగంగా తీసుకున్నారట.
మహేష్ చంద్ర పేరు చెప్పగానే చాలామందికి ప్రేయసి రావే గుర్తుకొస్తుంది. ప్రేమకథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా ఆయన పూర్తిగా కుటుంబ కథనే ఎంచుకున్నారు. కాకపోతే ఈసారి తండ్రి, కూతురు బంధాన్ని కథలో హైలెట్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో కూడా ఇంట్లో జరిగే సరదా గొడవలు, పెళ్లి చుట్టూ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాకు బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో హైలెట్. ఆయన పాత్రలో కనిపించకుండా కథను పరిచయం చేసే విధంగా వాయిస్‌ను ఉపయోగించినట్టు టీమ్ చెబుతోంది. ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేశారు. సినిమా కథకు తగ్గట్టుగా సంగీతం, కామెడీని తీసుకెళ్లినట్టు ప్రమోషనల్ కంటెంట్ చూస్తే తెలుస్తోంది.
మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మాతలుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 18న పెద్ద సినిమాల మధ్య ఈ ఫ్యామిలీ డ్రామా కూడా ప్రేక్షకుల కోసం థియేటర్లలోకి వస్తోంది. ఇక ఈ మధ్య ఫ్యామిలీ కథలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి టైమ్ లో ఈ సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
