కొత్త సినిమాలే.. కానీ కథలు మాత్రం పాత కాలంలోనే!
ప్రభాస్ ‘ఫౌజీ’లో హిస్టారికల్ సెటప్ ఉండబోతోందనే టాక్ ఉంది. ‘రణబలి’ కూడా పీరియడ్ జోన్‌లోనే వెళ్తోంది. అంటే పెద్ద సినిమాలకు పాత కాలం మీద ఇష్టం మళ్లీ పెరిగినట్లే కనిపిస్తోంది.
By: M Prashanth | 24 Aug 2026 10:03 AM ISTఈమధ్య స్టార్ హీరోల సినిమాలు చూస్తే ఒక కామన్ పాయింట్ కనిపిస్తోంది. కథలు మాత్రం ఇప్పుడు జరుగుతున్న కాలంలో లేవు. ఎన్‌బీకే111ను 1993 బాంబే బ్యాక్‌డ్రాప్‌లో తీసుకెళ్తున్నారు. ‘టాక్సిక్’లో కూడా పాత గోవా వాతావరణం ఉంది. ప్రభాస్ ‘ఫౌజీ’లో హిస్టారికల్ సెటప్ ఉండబోతోందనే టాక్ ఉంది. ‘రణబలి’ కూడా పీరియడ్ జోన్‌లోనే వెళ్తోంది. అంటే పెద్ద సినిమాలకు పాత కాలం మీద ఇష్టం మళ్లీ పెరిగినట్లే కనిపిస్తోంది.
దానికి ఒక సింపుల్ కారణం ఉంది. ఇప్పుడు మొబైల్, సీసీ కెమెరాలు, సోషల్ మీడియా, గూగుల్ మ్యాప్స్ ఉన్న కాలంలో కథ రాస్తే చాలా విషయాలకు లాజిక్ చెప్పాల్సి వస్తుంది. హీరో ఎక్కడికి వెళ్లాడు, పోలీసులు ఎందుకు ట్రేస్ చేయలేదు, వీడియో ఎందుకు బయటకు రాలేదు అనే ప్రశ్నలు వెంటనే వస్తాయి. పాత కాలం అయితే దర్శకుడికి కథ నడిపించడానికి కాస్త ఎక్కువ ఫ్రీడమ్ దొరుకుతుంది.
యాక్షన్ సినిమాలకు ఇది ఇంకా ఉపయోగపడుతుంది. 80లు, 90లు లేదా అంతకంటే పాత కాలం పెడితే గ్యాంగ్స్, రాజకీయాలు, అండర్‌వర్డ్, పోలీస్ వ్యవస్థను వేరే స్టైల్‌లో చూపించొచ్చు. కార్లు, దుస్తులు, వీధులు, సెట్స్ కూడా సినిమా లుక్‌ను కొత్తగా మార్చేస్తాయి. అందుకే భారీ బడ్జెట్ ఉన్నప్పుడు పీరియడ్ బ్యాక్‌డ్రాప్ పెట్టడం విజువల్‌గా కూడా పెద్ద ప్లస్ అవుతోంది.
ఎన్‌బీకే111లో 1993 బాంబే పెట్టడం వల్ల బాలయ్యను రెగ్యులర్ మాస్ సెటప్ నుంచి బయటకు తీసుకెళ్లే ఛాన్స్ వచ్చింది. ‘టాక్సిక్’లో గోవా బ్యాక్‌డ్రాప్ కూడా యష్‌ను ‘కేజీఎఫ్’లో చూసిన ప్రపంచం నుంచి వేరేలా చూపించడానికి ఉపయోగపడుతోంది. అంటే పాత కాలం పెట్టడం కథ కోసం మాత్రమే కాదు.. హీరోకు కొత్త లుక్ ఇవ్వడానికి కూడా పనికొస్తోంది.
అయితే ప్రతి పీరియడ్ సినిమా పని చేస్తుందనే లెక్క లేదు. ఆ కాలాన్ని ఎందుకు ఎంచుకున్నారో కథలో కారణం ఉండాలి. లేదంటే బ్యాక్‌డ్రాప్ మాత్రమే కొత్తగా కనిపించి, కథ మాత్రం పాతదే అనిపించే ప్రమాదం ఉంటుంది. ఒకప్పుడు ఫ్యాక్షన్, పోలీస్, ఫ్యామిలీ డ్రామాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అదే మాస్ కథలకు 90ల కాలం, పాత నగరాలు, హిస్టారికల్ సెటప్ జోడిస్తున్నారు. ట్రెండ్ ఎంతకాలం నడుస్తుందో తెలియదు కానీ ప్రస్తుతం స్టార్ సినిమాలకు పాత కాలమే కొత్త ప్యాకింగ్‌గా మారుతోంది.
