Begin typing your search above and press return to search.

సంగీతం ద్వారా గతాన్ని వెతుక్కునే కథే!

సెల్లో వాయించడం నేర్చుకోవడంలో ఉన్న శారీరక సవాలు , లోతైన మెళకువలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని పాస్కల్ తెలిపారు.

By:  Srikanth Kontham   |   4 Oct 2026 2:00 PM IST
సంగీతం ద్వారా గతాన్ని వెతుక్కునే కథే!
X

హాలీవుడ్ నటుడు పెడ్రో పాస్కల్- ఆస్కార్ విజేత , రచయిత, దర్శకుడు టోనీ గిల్ రాయ్ తెరకెక్కిస్తున్న చిత్రం `బేహెమోత్` లో ఒక సెల్లో వాయిద్యకారుడి పాత్రలో అలరించనున్నారు. ఈ పాత్ర కోసం పాస్క‌ల్ ప్రత్యేకంగా సెల్లో వాయించడం నేర్చుకున్నారు. ఇందులో సంగీతం కేవలం ఒక నేపథ్యంగా మాత్రమే కాకుండా పాత్ర గతాన్ని, వర్తమానాన్ని అనుసంధానించే అత్యంత కీలకమైన వారధిగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది.

సాధారణంగా సెల్లో బాణం పట్టుకోవడం నేర్చుకోవడానికే సంవత్సరం వరకు సమయం పడుతుంది. కానీ పెడ్రో పాస్కల్ ఈ పాత్ర కోసం ఎంతో వేగంగా వారంలోపే సెల్లో వాయించడంలో ప్రాథమిక మెళకువలను అభ్యసించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ తనకు నరకం స్వర్గం రెండింటినీ ఒకేసారి అనుభూతి చెందేలా చేసిందన్నారు. సవాలుతో కూడుకున్న ఈ ప్రయాణం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

సెల్లో వాయించడం నేర్చుకోవడంలో ఉన్న శారీరక సవాలు , లోతైన మెళకువలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని పాస్కల్ తెలిపారు. మరొక కళాకారుడి వద్ద శిష్యుడిగా మారి, కొత్త విద్యను అభ్యసించడం నటనా ప్రయాణంలో అత్యంత కష్టమైనద‌ని, అదే సమయంలో మ‌రుపురాని అనుభవంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ శిక్షణ క్రమంలో తాను సెల్లో వాయిద్యాన్ని వెళ్లిన ప్రతిచోటికీ తనతో పాటే తీసుకెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు.

ఈ పాత్ర సాధన కోసం ఆయన వియన్నా పర్యటనలో ఉన్నప్పుడు కూడా మోజార్ట్ కంపోజిషన్లను తీవ్రంగా అభ్యసించాల్సి వచ్చింది. ఆరంభంలో దర్శకుడు టోనీ గిల్‌రాయ్ పాత్ర గురించి చెప్పినప్పుడు తాను పూర్తి స్థాయిలో సెల్లో వాయించగలనా? లేదా? అని సందేహించానని, కానీ ధైర్యం చేసి సవాలును స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు పాస్కల్ వెల్లడించారు.

`బేహెమోత్` చిత్ర కథాంశం చూస్తే.. ఒక నాన్-లీనియర్ పద్ధతిలో సాగుతుంది. ఈ విభిన్నమైన కథా నిర్మాణం సరికొత్త నటనను ప్రదర్శించే అవకాశాన్ని ఇచ్చిందని పాస్కల్ వెల్ల‌డించారు. జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల నుండి పారిపోవడం లేదా వాటిని నిరోధించడం అనేది ఒక రకమైన ఆత్మద్రోహం లాంటింద‌ని .. కథలో ఈ అంశమే ప్రాజెక్ట్‌ వైపు ఆకర్షించిందని అభిప్రాయపడ్డారు.

చిత్రంలో సెల్లో వాయిద్యం ద్వారా వ్యక్తమయ్యే సంగీత స్వరాలు, ప్రధాన పాత్ర మానసిక సంఘర్షణలను, గతాన్ని . ప్రస్తుత జీవితాన్ని ఎంతొ ప్రభావవంతంగా ఆవిష్కరిస్తాయి. ఒక వైపు కఠినమైన వాయిద్య శిక్షణ, మరొక వైపు వైవిధ్యమైన కథనంతో రూపుదిద్దుకున్న `బేహెమోత్` హాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.