Begin typing your search above and press return to search.

రివ్యూ రైట‌ర్ల‌పై అసలు చరణ్ మైండ్‌లో ఏం ఉంది?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్- బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా `పెద్ది` బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   24 Jun 2026 9:27 AM IST
రివ్యూ రైట‌ర్ల‌పై అసలు చరణ్ మైండ్‌లో ఏం ఉంది?
X

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్- బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా `పెద్ది` బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘనవిజయం నేపథ్యంలో చిత్ర బృందం ఘ‌న‌మైన విజ‌యోత్స‌వ వేడుక‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. సినిమాను బేషరతుగా ఆదరించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రజలు అంత తేలిగ్గా ఎవరినీ ప్రేమించరని... కానీ ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం వదిలిపెట్టరంటూ చరణ్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయితే ఇదే వేదికపై రామ్ చరణ్ `పెద్ది` రివ్యూల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ``పెద్ది సినిమాకు అటూ ఇటూగా రివ్యూలు వచ్చాయి. కొందరు సినిమాను అటూ ఇటూగా చూపించడానికి ప్రయత్నించారు.. కానీ ప్రేక్షకులు మాత్రం మా కష్టాన్ని గుర్తించి సినిమాను భుజాలపై మోశారు`` అని చరణ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో పెద్ద, చిన్న ఛానెళ్లు అనే తేడా లేకుండా రివ్యూలు రాసిన రైటర్లందరికీ ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం విశేషం. కేవలం అభిమానులకే కాకుండా సామాన్య ప్రజలందరికీ రీచ్ అయినప్పుడే సినిమా నిజమైన విజయం సాధిస్తుందని.. `పెద్ది` అలాంటి చిత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు.

చరణ్ వ్యాఖ్యలపై ప్రస్తుతం నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు చరణ్ మైండ్‌లో ఏముంది? రివ్యూ రైటర్లు అటూ ఇటూగా రాశారని ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది? అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. `పెద్ది` సినిమా విడుదలైనప్పుడు రివ్యూలన్నీ ఉన్నది ఉన్నట్లుగానే ప్లస్ లు, మైనస్‌లను విశ్లేషించాయని కొందరు గుర్తు చేస్తున్నారు. సినిమాలో రామ్ చరణ్ పడిన కష్టాన్ని, ఆయన మేకోవర్‌ను, నటనను ప్రతి ఒక్క రివ్యూ రైటర్ ప్రశంసించారని... అలాంటప్పుడు కొందరు సినిమాపై అటూ ఇటూగా స‌మీక్ష‌లు రాసార‌ని చూశారని చరణ్ అనడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి రామ్ చరణ్ మనసులో రివ్యూ రైటర్లపై ఎలాంటి నెగెటివిటీ లేదని... ఆయన కేవలం సినిమాకు వచ్చిన భిన్నమైన టాక్‌ను మాత్రమే ప్రస్తావించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు సహజంగానే పాజిటివ్, నెగెటివ్ అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. చరణ్ తన మైండ్‌లో ఉన్న ఆ విషయాన్నే నేరుగా చెబుతూ.. రివ్యూలు ఎలా ఉన్నప్పటికీ ప్రేక్షక దేవుళ్లు మాత్రం సినిమాను పెద్ద హిట్ చేశారని కొనియాడారు. పైగా రివ్యూలు రాసిన ప్రతి ఒక్కరికీ చివర్లో థాంక్స్ చెప్పడం ద్వారా చరణ్ తన సంస్కారాన్ని, హుందాతనాన్ని చాటుకున్నారని అభిమానులు సమర్థిస్తున్నారు.

రామ్ చ‌ర‌ణ్- జాన్వీ నాయ‌కానాయిక‌లుగా న‌టించిన పెద్ది చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి దిగ్గజ తార‌లు కీల‌క పాత్ర‌లు పోషించిన సంగ‌తి తెలిసిందే. రివ్యూల విషయంలో సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ నడిచినా.. రామ్ చరణ్ మాత్రం కలెక్షన్ల పరంగా, ప్రేక్షకుల ఆదరణ పరంగా తన సినిమా సాధించిన విజయంతో హ్యాపీగా ఉన్నారు. విమర్శలను సైతం స్వీకరిస్తూనే... ప్రేక్షకుల ప్రేమే తమకు కొండంత బలమని చరణ్ ఈ సక్సెస్ మీట్ లో త‌న‌ను తాను స‌మీక్షించుకున్నారు.