ఎగ్జిబిటర్లు (X) నిర్మాతలు: 'పెద్ది' విడుదలకు అడ్డంకులు సృష్టిస్తున్నారా?
ఈ నెల 18వ తేదీన ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ ప్రతిదీ నిర్ణయిస్తుందని రవిశంకర్ వెల్లడించారు.
By: Sivaji Kontham | 14 May 2026 9:21 AM ISTతెలంగాణలో సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు... నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం `పెద్ది` వంటి పెద్ద సినిమాల విడుదలపై నీలినీడలు కమ్ముకొనేలా చేస్తోందనే కథనాలొస్తున్నాయి. సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానం అమలు చేయాలన్న ఎగ్జిబిటర్ల డిమాండ్‌పై నిర్మాతలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తూ.. సినిమా విడుదలకు ముందు ఇలాంటి నిబంధనలు తీసుకురావడం సరికాదని మండిపడ్డారు. థియేటర్లలో సౌండ్ సిస్టమ్, టాయిలెట్స్ వంటి కనీస అవసరాలు సరిగా లేవని ముందు వాటిని సరిగా చేస్తే.. జనాలు థియేటర్లకు వస్తారని హితవు పలికారు.
తమ ప్రతిష్టాత్మక చిత్రం `పెద్ది` విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ వివాదాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక ఆంతర్యమేమిటని మైత్రి రవిశంకర్ ప్రశ్నించారు. మైత్రి సమర్పణలో సతీష్ నిర్మించిన `పెద్ది`తో పాటు మరో ఐదారు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో సమస్యను పెద్దది చేయడం ఎంతవరకు సమంజసం? అని నిలదీశారు. గతంలో పెద్ద సినిమాలు ఉన్నప్పుడు సజావుగా సాగిన వ్యవహారం.. ఇప్పుడు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తోందని... సినిమాలను హ్యాపీగా రిలీజ్ చేస్తే ఎగ్జిబిటర్లకు విగ్రహాలు కడతామని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ సమస్యను కేవలం ఒక నిర్దిష్ట కోణంలోనే చూడాలని.. దీనికి ఇతర రాజకీయ లేదా వ్యక్తిగత రంగులు పులమకూడదని మైత్రి రవి కోరారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై వస్తున్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు. గత ఎనిమిది నెలలుగా.. ముఖ్యంగా `హరి హర వీరమల్లు` సినిమా విడుదల సమయం నుండి సాగుతున్న ప్రచారాన్ని రవిశంకర్ ప్రస్తావించారు. ఈ వివాదాల వెనుక ఏదో `అదృశ్య శక్తి` లేదా `నాలుగో సింహం` ఉండి ఆంధ్రలో ఏదో చేస్తోందని ప్రచారం సాగుతోందని గుర్తు చేసుకున్నారు. అయితే కేవలం అపోహల ఆధారంగా ఇలాంటి చర్చలు జరపడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు.
ఈ మొత్తం వ్యవహారం కేవలం థియేటర్ల లెస్సీల (అద్దెకు తీసుకున్న వారు) సమస్యకు సంబంధించిందని రవిశంకర్ వివరించారు. ఇది రెండు వర్గాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, ఆధిపత్య పోరు అంతకంటే కాదని ఆయన తేల్చి చెప్పారు. కేవలం లెస్సీల నిర్వహణ.. నిబంధనల విషయంలో తలెత్తిన సమస్యల గురించి మాత్రమే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. దీనిని పరిశ్రమలోని అంతర్గత సర్దుబాటుగా చూడాలని కోరారు.
పెద్ద సినిమాల విడుదల విషయంలో ప్రేక్షకులు గానీ.. పరిశ్రమ వర్గాలు గానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవిశంకర్ హామీ ఇచ్చారు. ఏ సినిమా రిలీజ్ కైనా ఎటువంటి అడ్డంకులు ఉండవని, అన్నీ సజావుగా సాగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్నది తాత్కాలిక సమస్య మాత్రమేనని..చర్చల ద్వారా ఇది త్వరలోనే పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ ఏవైనా క్లిష్ట సమస్యలు ఎదురైతే పరిశ్రమలోని పెద్ద మనుషులు కూర్చుని వాటిని పరిష్కరిస్తారని చెప్పారు.
ఈ నెల 18వ తేదీన ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ ప్రతిదీ నిర్ణయిస్తుందని రవిశంకర్ వెల్లడించారు. ఈ కమిటీ పెద్ద సినిమాల విడుదల.. ఇతర సమస్యల గురించి లోతుగా చర్చిస్తుందని తెలిపారు. పెద్ది సహా ఇతర సినిమాల విడుదల పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని.. ఈ సమస్య కేవలం ప్రస్తుతానికి మాత్రమే పరిమితమని ఆయన స్పష్టం చేశారు.
మొత్తానికి `పెద్ది` వంటి భారీ చిత్రాల విడుదల వేళ తలెత్తిన ఈ విభేదాలు టాలీవుడ్‌లో వేడిని పుట్టిస్తున్నాయి. తదుపరి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో కమిటీ ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారాన్ని చూపుతుందో చూడాలి. అటు ఎగ్జిబిటర్ల పట్టుదల, ఇటు నిర్మాతల నిలదీత మధ్య సమన్వయం కుదిరితేనే ప్రేక్షకులు కోరుకున్న సినిమాలు సజావుగా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తాత్కాలిక సమస్యను పెద్ద మనుషుల సమక్షంలో త్వరగా పరిష్కరించుకోవడమే అందరికీ శ్రేయస్కరమనే విశ్లేషణలు సాగుతున్నాయి.
