Begin typing your search above and press return to search.

పెద్ది రిలీజ్ డేట్.. అసలు SKN చెప్పింది నిజమేనా?

స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

By:  M Prashanth   |   31 March 2026 10:50 AM IST
పెద్ది రిలీజ్ డేట్.. అసలు SKN చెప్పింది నిజమేనా?
X

స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఆ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు.

అయితే ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఆ సినిమా మరోసారి పోస్ట్‌పోన్ అవుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయింది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా సోమవారం అల్లు సినిమాస్‌ లో సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

ఆ కార్యక్రమంలో ఎస్కేఎన్ మాట్లాడుతూ, చెన్నై లవ్ స్టోరీ మూవీ జూన్ 26న విడుదల చేయాలని భావించామని తెలిపారు. అయితే అదే రోజు రామ్ చరణ్ పెద్ది విడుదల అవుతుందని దర్శకుడు సాయి రాజేష్ తనకు చెప్పాడని పేర్కొన్నారు. అందుకే తమ సినిమా రిలీజ్ డేట్‌ ను మార్చాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పెద్ది రిలీజ్ డేట్ మారిందని, మళ్లీ వాయిదా పడిందని నెటిజన్లు చర్చించుకోవడం ప్రారంభించారు. మేకర్స్ అధికారికంగా ప్రకటించకముందే ఇలా కొత్త తేదీ బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ విషయంపై వెంటనే స్పందించిన ఎస్కేఎన్, తాను చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థమయ్యాయని వివరణ ఇచ్చారు. చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్‌ లో చిన్న మిస్ కమ్యూనికేషన్ జరిగిందని తెలిపారు.

సాయి రాజేష్‌ ను తమ మూవీ రిలీజ్ డేట్ గురించి అడిగితే, సోషల్ మీడియాలో జూన్ 25న పెద్ది విడుదలంటూ ట్వీట్స్ చూసినట్లు చెప్పాడని వివరించారు. అందుకే ఆ రోజు తమ సినిమా విడుదల ఉండదని తాను చెప్పానని అన్నారు. కానీ తర్వాత తెలుసుకున్నది ఏమిటంటే, పెద్ది విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ లేదని తెలిపారు.

మేకర్స్ ప్రకటించే వరకు ఏ తేదీపై మాట్లాడొద్దని సాయి రాజేష్ చెప్పిన విషయాన్ని తాను సరిగా అర్థం చేసుకోలేదని ఎస్కేఎన్ స్పష్టం చేశారు. అందుకే పెద్ది రిలీజ్ డేట్‌ తాను ప్రకటించినట్లుగా మారిందని, దీనిపై క్షమాపణలు కోరారు. అలాగే పెద్ది సినిమా వాయిదా పడిందని తాను ఎక్కడా వినలేదని పేర్కొన్నారు. మేకర్స్ అధికారిక ప్రకటన చేసినప్పుడు రిలీజ్ డేట్ తెలిసే అవకాశం ఉందని చెప్పారు. అయితే పెద్ది టీమ్ మాత్రం ఆ విషయంపై స్పందించలేదు. దీంతో రిలీజ్ డేట్‌ పై ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.