పెద్ది.. ఇలా ఇంకెన్నిసార్లు?
పెద్ది మూవీ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా అభిమానుల్లో ఓవైపు నిరాశ ఉండగా.. మరోవైపు రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది.
By: M Prashanth | 30 April 2026 1:32 PM ISTపెద్ది మూవీ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా అభిమానుల్లో ఓవైపు నిరాశ ఉండగా.. మరోవైపు రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే నేడు (ఏప్రిల్ 30) ఆ సినిమా థియేటర్లలో సందడి చేసేది. కానీ రిలీజ్ డేట్ మళ్లీ మారిపోవడంతో, ఎప్పుడెప్పుడు వస్తుందా అన్న ఉత్కంఠ పెరుగుతోంది. మొదట ఆ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా వేశారు.
అయితే ఆ తేదీకి కూడా సినిమా పూర్తిగా సిద్ధం కాలేకపోవడంతో మరోసారి పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. చివరకు జూన్ 25న రిలీజ్ చేస్తామని ఓ ఈవెంట్ లో దర్శకుడు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు. దీంతో అంతా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా చర్చలోకి వచ్చింది. ఆ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ముందుగా మే 1న రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ, పెద్ది కోసం ఒకసారి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఒక్క రోజు గ్యాప్ తో రెండు సినిమాలు విడుదల కానున్నాయన్న వార్తలు ఆసక్తి రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో లెనిన్ మళ్లీ వాయిదా పడుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ తో క్లారిటీ వచ్చింది. ఫస్ట్ కాపీ చూసినట్టు చెబుతూ, అఖిల్ కొత్తగా కనిపిస్తాడని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. జూన్ 26 తేదీ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
దీంతో ఈసారి అక్కినేని ఫ్యామిలీ వెనక్కి తగ్గే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి రామ్ చరణ్, అఖిల్ ఇద్దరూ మంచి స్నేహితులే. అలాగే చిరంజీవి, నాగార్జున మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. అందుకే ఇంతకుముందు ఒకసారి రిలీజ్ డేట్ విషయంలో సర్దుబాటు జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారినట్టుగా కనిపిస్తోంది. మరోవైపు యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా కూడా ఆ చర్చలోకి వచ్చింది. మొదట మార్చి నెలాఖరులో రిలీజ్ చేయాలని భావించిన ఆ చిత్రాన్ని జూన్ 4కి వాయిదా వేశారు.
అయితే ఇప్పుడు ఆ సినిమా కూడా మళ్లీ పోస్ట్ పోన్ అయింది. దీంతో పెద్ది సినిమాను జూన్ 25కు బదులుగా జూన్ 4న రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. జూన్ 12 వరకు స్టూడెంట్స్ కు సమ్మర్ హాలిడేస్ ఉండటం వల్ల, జూన్ 4వ తేదీన రిలీజ్ అయితే కలెక్షన్స్ కు అనుకూలంగా ఉంటుందని, మంచి తేదీ అవుతుందని భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో స్పష్టత లేదు.
ఇటీవల బుచ్చిబాబునే జూన్ 25నే ఫైనల్ రిలీజ్ డేట్ అని చెప్పడంతో, ఇప్పటివరకు అదే అఫీషియల్. అయినప్పటికీ విడుదల తేదీపై గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. మొత్తానికి పెద్ది సినిమా రిలీజ్ డేట్ చుట్టూ కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఇంకెన్నిసార్లు మార్చుతారంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. సరైన సినిమా కోసం సరైన తేదీ తప్పదని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక మేకర్స్ నుంచి వచ్చే అధికారిక ప్రకటనతో కంప్లీట్ క్లారిటీ రానుంది.
