Begin typing your search above and press return to search.

చరణ్ 'పెద్ది'.. నార్త్ US ప్లాన్ మామూలుగా లేదుగా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   7 May 2026 1:17 PM IST
చరణ్ పెద్ది.. నార్త్ US ప్లాన్ మామూలుగా లేదుగా!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఉప్పెనతో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ బ్యాక్‌ డ్రాప్‌ తో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా ఇప్పటికే మంచి హైప్ సంపాదించుకుంది.





అయితే పెద్ది మూవీ విడుదల తేదీ విషయంలో ఇప్పటికే పలుమార్లు మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే రీసెంట్ గా చిత్రబృందం అధికారికంగా జూన్ 4న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 3 నుంచే ఓవర్సీస్ ప్రీమియర్లు కూడా వేయనున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆ సినిమాను విడుదల చేయనున్నారు.





ఇక ఇప్పుడు పెద్ది విషయంలో ఎక్కువ చర్చ జరుగుతోంది నార్త్ అమెరికా రిలీజ్ ప్లాన్ గురించే. ఆ సినిమాను అక్కడ భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నార్త్ అమెరికా హక్కులు ప్రముఖ ప్రత్యంగిరా సినిమాస్ సొంతం చేసుకుంది. తాజాగా ఆ సంస్థ విడుదల చేసిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సినిమాను సాధారణ స్క్రీన్లతో పాటు ప్రీమియం ఫార్మాట్స్‌ లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా సినీమార్క్ XD, RPX వంటి భారీ స్క్రీన్ ఫార్మాట్స్‌ లో పెద్ది మూవీ రిలీజ్ కానుండటం ఆసక్తి రేపుతోంది. దీనితో ఓవర్సీస్ మార్కెట్‌ పై నిర్మాతలు ఎంత కాన్ఫిడెన్స్‌ తో ఉన్నారో అర్థమవుతోందని సినీ ప్రియులు చెబుతున్నారు.

అలాగే జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్స్ వేయనున్నట్లు కూడా ప్రకటించింది. ఇప్పటికే థియేటర్ల తొలి జాబితాను విడుదల చేసిన ప్రత్యంగిరా సినిమాస్.. మరికొన్ని గంటల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని వెల్లడించింది. అమెరికాలో తెలుగు సినిమాలకు ఉన్న మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్‌ కు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉండటంతో పెద్దికి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి చేరుకోవడం పెద్దికి బాగా కలిసొస్తోందని అంతా భావిస్తున్నారు. ఇప్పుడు నార్త్ అమెరికాలో రికార్డు స్థాయి స్క్రీన్లలో విడుదల చేసేలా ఏర్పాట్లు జరుగుతుండటంతో.. పెద్దిపై మేకర్స్ ఎంత పెద్ద ప్లాన్ వేశారో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ల పై రూపొందుతున్న ఆ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతిబాబు, బోమన్ ఇరానీ, వీజీ చంద్రశేఖర్, సత్య తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలు నవీన్ నూలి నిర్వహిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏదేమైనా ఓవర్సీస్ లో పెద్ది సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.