'పెద్ది' స్పెషల్ సాంగ్ కు అంతా సెట్? లక్కీ ఛాన్స్ 'ఆమె'కేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్దిపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.
By: M Prashanth | 15 April 2026 4:00 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్దిపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా ఆ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అభిమానుల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకున్నట్టు సమాచారం. ఇంకా ఒక కీలకమైన స్పెషల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే చరణ్ సినిమాల్లో పాటలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఒక ప్రత్యేక గీతాన్ని మేకర్స్ ప్లాన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పెద్దిలో కూడా అలాంటి ఒక మాస్ నంబర్ ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఆ స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ తో కలిసి డ్యాన్స్ చేసే హీరోయిన్ ఎవరు అన్నదానిపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. మొదటగా తారక్ పొన్నప్ప, ఆయేషా ఖాన్ వంటి పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ పేరు ఫ్రంట్ రన్నర్ గా నిలిచింది.
సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్, తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇంతవరకు క్లాసీ, ఎమోషనల్ పాత్రల్లో కనిపించిన ఆమె, ఇప్పుడు ఒక మాస్ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. రామ్ చరణ్ తో కలిసి మొదటిసారి స్టెప్పులు వేయబోతుందనే విషయం.. మరింత క్రేజ్ తీసుకొచ్చింది.
ఇక ఇటీవల మృణాల్ నటించిన డెకాయిట్ సినిమాపై రామ్ చరణ్ సోషల్ మీడియాలో స్పందించడం కూడా ఆ రూమర్లకు బలం చేకూర్చినట్టైంది. దీంతో అభిమానుల్లో ఆ కాంబినేషన్ పై ఆసక్తి మరింత పెరిగింది. మరికొంతమంది మాత్రం ఆయేషా ఖాన్ పేరునే ఆశించినా, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మృణాల్ కే లక్కీ ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఆ మాస్ ట్యూన్.. సినిమాకు హైలైట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో ఆ పాటకు అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని ఇప్పటికే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద పెద్ది సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, స్పెషల్ సాంగ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. మృణాల్ ఠాకూర్ పేరు ఫైనల్ అవుతుందా? లేక మరో హీరోయిన్ కు అవకాశం ఇస్తారా? అన్నది వేచి చూడాలి.
