'పెద్ది'పై మెగా అంచనా: ఆ రేంజులో హైప్ పెంచేసిన బాసు! ఆశించినది చిక్కుతుందా?
దర్శకుడు బుచ్చిబాబు సానా రామ్ చరణ్‌కు దాదాపు 2 గంటల 40 నిమిషాల సుదీర్ఘమైన స్క్రిప్టు నెరేషన్ ఈ సినిమా కథలోని డెప్త్‌కు సహకరించింది.
By: Sivaji Kontham | 19 May 2026 2:19 PM ISTమెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `పెద్ది`. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. జూన్ 4న సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల కానుంది. ఇటీవల ముంబై ట్రైలర్ లాంచ్ వేడుక తర్వాత అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. సుమారు రెండేళ్ల పాటు ఈ చిత్రం కోసం రామ్ చరణ్ పడిన శ్రమ, దర్శకుడు బుచ్చిబాబు సానా సిద్ధం చేసిన కథా బలం సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు తెర తీసాయి. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన మగధీర- ఆర్.ఆర్.ఆర్ వంటి సంచలన చిత్రాలతో పోలుస్తూ.. మెగాస్టార్ చిరంజీవి `పెద్ది` చిత్రాన్ని దశాబ్దానికి ఒకసారి వచ్చే అరుదైన సినిమాగా అభివర్ణించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. బాక్సాఫీస్ వద్ద కేవలం కమర్షియల్ హంగులు, గ్రాఫిక్స్ హడావుడి మాత్రమే ఉంటే సరిపోదని.. సినిమాకు నెక్స్ట్ లెవెల్ విజయాన్ని అందించేది అందులోని భావోద్వేగాలతో నిండిన సోల్ మాత్రమే!నని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించడాన్ని బట్టి ఆలోచిస్తే చిరుకు ఇది ఎంతగా కనెక్టయిందో అర్థం చేసుకోవచ్చు.
దర్శకుడు బుచ్చిబాబు సానా రామ్ చరణ్‌కు దాదాపు 2 గంటల 40 నిమిషాల సుదీర్ఘమైన స్క్రిప్టు నెరేషన్ ఈ సినిమా కథలోని డెప్త్‌కు సహకరించింది. కథ విన్న వెంటనే తాను సైలెంట్ అయిపోయానని.. కథాంశంలోని విజువల్స్ ని ఊహించుకుని .. ఇందులో భావోద్వేగాల బలానికి ముగ్ధుడై ఈ ప్రయాణాన్ని ప్రారంభించానని చరణ్ ఇంతకుముందే చెప్పారు.
`మగధీర`లో పునర్జన్మలు, `ఆర్.ఆర్.ఆర్`లో విప్లవ వీరుల పోరాటాలు ప్రేక్షకులను విస్మయం కలిగించే భ్రమలో ముంచెత్తితే `పెద్ది` చిత్రం ఒక సామాన్య యువకుడు సమాజంలో ఎదుర్కొనే ఐడెంటిటీ క్రైసిస్ ఎమోషన్‌ని రగిలిస్తుంది. కథంతా దీని చుట్టూనే తిరుగుతుంది. ఇదొక అనవసర గ్రాఫిక్స్ తో పని లేని ఎమోషనల్ డ్రామా అని చరణ్ స్వయంగా వెల్లడించారు గనుక ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ హంగులను మించి కథాబలం, పాత్రల సంఘర్షణే కీలకంగా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు.
సినిమా థీమ్ ని విశ్లేషిస్తే.. సినిమాలోని కథానాయకుడు ఒక సాధారణ గ్రామీణ లేదా క్రీడా నేపథ్యం నుండి వచ్చి.. దిల్లీ వంటి మహానగరంలో ఒక పెద్ద ఆశయం కోసం.. సమాజం మెచ్చే ఒక గొప్ప కాజ్ కోసం క్రాస్ వోవర్ అథ్లెట్ గా మారుతాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు.. కఠినమైన శారీరక శ్రమ... మానసిక వేదన ట్రైలర్ లో కనిపించాయి. ఇవన్నీ సినిమా చూసే ఆడియెన్ లో పెయిన్ ని నింపుతాయని అంచనా. సమాజంలో ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక దశలో గుర్తింపు కోసం- ఆత్మగౌరవం కోసం పోరాడుతూనే ఉంటాడు కాబట్టి ఈ `అస్థిత్వ పోరాటం` అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ భాషా ప్రేక్షకులకైనా సులభంగా కనెక్ట్ అయ్యే యూనివర్శల్ థీమ్ గా భావించవచ్చు. కమర్షియల్ హంగులు సినిమాకు కేవలం భారీ ఓపెనింగ్స్ మాత్రమే తీసుకురాగలవు.. కానీ గుండెలను పిండేసే ఇలాంటి లోతైన కథా బలమే సినిమాను లాంగ్ రన్‌లో నిలబెడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రామ్ చరణ్ గత చిత్రాలను పరిశీలిస్తే.. `రంగస్థలం`లో చిట్టిబాబు పాత్రకు అతడు ఎలాంటి జీవం పోసాడో చూసాం. చెవి వినబడని చిట్టిబాబుగా భావోద్వేగాలను పండించడంలో చరణ్ నటనకు ప్రశంసలు కురిసాయి. ఇప్పుడు `పెద్ది` చిత్రంలో అంతకుమించిన ప్రయోగాత్మక పాత్రలలో నటించాడు. దీనికోసం శారీరకంగా, మానసికంగా కూడా చాలా అలసిపోయాడని అర్థమవుతోంది.
దాదాపు 150కి పైగా సినిమాలు చేసిన అపార అనుభవంతో చిరంజీవి ఈ సినిమా రషెస్ చూసి తీవ్ర భావోద్వేగానికి లోనవ్వడం చూస్తుంటే బుచ్చిబాబు ఏదో సంథింగ్ ప్రయత్నించాడని అర్థం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం మనకు మగధీరలు, ఆర్.ఆర్.ఆర్ లు రావు కాబట్టి ఈ రేర్ జర్నీలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించమని కొడుకు రామ్ చరణ్ కు చిరు సలహా ఇచ్చారు. అంతేకాదు నటుడిగా తనకు మరో లెవల్ సినిమా ఇదని చరణ్ తన నమ్మకాన్ని ప్రతిసారీ వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ సినిమాను తన వ్యక్తిగత లైబ్రరీలో జీవితాంతం దాచుకుంటానని చరణ్ అన్నారు.
వెండితెరపై సినిమా ఎంత భారీతనంతో ఉంది అనేది ప్రేక్షకుడు చూడడు. అందులో ప్రేక్షకుడు తనను తాను చూసుకునే భావోద్వేగానికి గురవ్వకపోతే అది బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. `పెద్ది` చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ కేవలం పైపూత మాత్రమేనని.. ఇన్ డెప్త్ గా ఒక యువకుడి అస్థిత్వ పోరాటమే ఈ సినిమాకు అసలైన ప్రాణమని చిరంజీవి విశ్లేషణ ద్వారా స్పష్టమవుతోంది. భారీ యాక్షన్ సినిమాలు ప్రతి ఏటా బోలెడన్ని వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ఇలాంటి గుండెలను పిండేసే అద్భుతమైన కథ దొరకడానికి ఒక దశాబ్దం పడుతుందని చిరు వ్యాఖ్యానించడం వెనక మర్మాన్ని అర్థం చేసుకోవాలి. టెక్నాలజీ హంగులపైనే ఎక్కువగా ఆధారపడుతున్న నేటి ఆధునిక సినిమా కాలంలో ప్యూర్ ఎమోషన్స్.. క్యారెక్టర్-డ్రివెన్ కథా బలంతో పెద్ది వస్తోందని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాలో చరణ్ ఒక క్రికెటర్‌గా, ఒక రెజ్లర్‌గా, ఒక అథ్లెట్ గా.. ఇలా ఎందుకు రూపాంతరం చెందాడు? అనేది ట్రైలర్ కంటే ఉత్తమంగా సినిమాలో కన్వే చేయాల్సి ఉంటుంది. విభిన్నమైన పాత్రలలోకి పరకాయం చేయడానికి చరణ్ చాలా హార్డ్ వర్క్ చేసినా, కనెక్టింగ్ ఎలిమెంట్ ఎంతో బలంగా ఉండాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే.
