Begin typing your search above and press return to search.

పెద్ది.. ఈ లెక్క జెట్ స్పీడ్ లో తేలాల్సిందే..

టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ ‘పెద్ది’ రిలీజ్ కాదు, ఆ సినిమా ఆడే థియేటర్లే ఉంటాయా అనేది.

By:  M Prashanth   |   13 May 2026 1:34 PM IST
పెద్ది.. ఈ లెక్క జెట్ స్పీడ్ లో తేలాల్సిందే..
X

టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ ‘పెద్ది’ రిలీజ్ కాదు, ఆ సినిమా ఆడే థియేటర్లే ఉంటాయా అనేది. రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ జూన్ 4న గ్రాండ్‌గా రావాల్సి ఉంది. కానీ తెర వెనుక మాత్రం పెద్ద యుద్ధమే నడుస్తోంది. రెంటల్ సిస్టమ్ వద్దు, పర్సంటేజ్ ముద్దు అంటూ ఎగ్జిబిటర్లు డైరెక్ట్‌గా అల్టిమేటం ఇచ్చేశారు. ఈ గొడవ ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ మెడకు చుట్టుకుంది.

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ పోరాటం కేవలం డబ్బు గురించి కాదు. సింగిల్ స్క్రీన్‌ల ఉనికి కోసం జరుగుతున్న చివరి ప్రయత్నం. RRR తర్వాత తెలంగాణలోనే వంద థియేటర్లు మూతపడ్డాయని చెబుతున్నారు. కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్, స్టాఫ్ జీతాలు తడిసి మోపెడవుతున్నాయి. అదే సమయంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా అయ్యి కోట్లు కొల్లగొడుతున్నాయి. ముంబై, ఢిల్లీ, చెన్నైలో పర్సంటేజ్ ఇచ్చే నిర్మాతలు, సొంత రాష్ట్రంలో మాత్రం పాత రెంటల్ పద్ధతినే పట్టుకుని వేలాడుతున్నారనేది ఎగ్జిబిటర్ల ప్రధాన ఆరోపణ.

ఈసారి ఎగ్జిబిటర్ల వెనుక బలం కూడా పెరిగింది. దిల్ రాజు బ్రదర్ శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్లే ముందుండి నడిపిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్ కూడా ఉందనే టాక్ ఉంది. అంటే ఇది నలుగురు థియేటర్ ఓనర్ల గోల కాదు, ఒక ఆర్గనైజ్డ్ మూవ్‌మెంట్ అని అర్ధమవుతుంది.

ఇక మైత్రి వాళ్ళు ఈ గోడవపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు. గిల్డ్ నుంచి ప్రముఖ నిర్మాతలు ఈ రోజే ఓ క్లారిటి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇక మైత్రి వీలైనంత త్వరగా ఒక పరిష్కారాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల వాళ్ల ‘జెట్లీ’ రిలీజ్ రోజే థియేటర్లు దొరక్క ఇబ్బంది పడిందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే సీన్ ‘పెద్ది’కి రిపీట్ అయితే రిస్క్ తీసుకున్నట్లే. తెలంగాణలో 400కు పైగా స్క్రీన్లు, ఆంధ్రాలో కలిపితే వెయ్యికి పైనే. ఈ స్క్రీన్లు లేకపోతే ‘పెద్ది’ ఫస్ట్ డే నెంబర్లకే గండి పడుతుంది.

అయితే నిర్మాతల వర్షన్ కూడా వినాలి. పాన్ ఇండియా రిలీజ్‌కి అయ్యే ఖర్చు, రిస్క్ మామూలుది కాదు. పైగా మల్టీప్లెక్స్‌లు డాల్బీ, 4K అంటూ కోట్లు పెడుతుంటే, చాలా సింగిల్ స్క్రీన్లు ఇంకా అప్‌గ్రేడ్ కాలేదు. ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్ కోసం డబ్బు కట్టేది మల్టీప్లెక్స్‌కే అనే వాదన ఉంది. నిజానికి థియేటర్లు మోడ్రన్ అయితే జనం వస్తారు. కానీ ఆ అప్‌గ్రేడ్‌కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మళ్లీ పర్సంటేజ్ దగ్గరికే వస్తుంది.

ఏదేమైనా ‘పెద్ది’ ఇప్పుడు రెండు పడవల మధ్య చిక్కుకుంది. ఒకవైపు రామ్ చరణ్ స్టార్‌డమ్, మరోవైపు ఇండస్ట్రీలో దశాబ్దాలుగా పేరుకుపోయిన రెంటల్ vs పర్సంటేజ్ లొల్లి. ఈ సమస్య ఇప్పుడు తేలకపోతే రేపు రాజమౌళి, ప్రభాస్ సినిమాలకు కూడా ఇదే తిప్పలు తప్పవు. మరి జూన్ 4 లోపు సామరస్యం కుదురుతుందా లేదా అనేది చూడాలి.